కొహెడను డివిజన్‌గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తుర్కయంజాల్ సర్కిల్‌ను చార్మినార్ నుంచి ఎల్‌బీనగర్ జోన్‌లో చేర్చాలని, జీహెచ్‌ఎంసీ 53వ డివిజన్‌కు కొహెడ పేరు పెట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇష్టానుసారంగా డివిజన్ల విభజన చేపట్టిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. సుమారు 80వేలకు పైగా ఓటర్లున్న తుర్కయంజాల్ సర్కిల్‌ను రెండు డివిజన్లు మాత్రమే చేయడం ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మరో డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ కందాల బల్‌దేవ్ రెడ్డి, కో కన్వీనర్‌లు సింగిరెడ్డి రాంరెడ్డి, కొమిరిశెట్టి భిక్షపతి, బుడ్డ విజయ్ బాబు, శీలం అంగత్ కుమార్, నాయకులు బాల్‌రెడ్డి, యాదగిరి, శివ తదితరులు పాల్గొన్నారు.
హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్‌లో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నట్లు జిల్లా ఫైర్ అధికారి– 2 బి.కేశవులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి గతంలో కలెక్టర్ 900 గజాల స్థలాన్ని సరూర్‌నగర్‌లో మంజూరు చేశారని అన్నారు. నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సరూర్‌నగర్, బాలాపూర్ ప్రజల సౌకర్యార్థం రెండేళ్ల క్రితం ఎల్బీనగర్ ఫైర్‌స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాహనాలతో ఎల్బీ నగర్ డివిజన్ హెడ్ ఆఫీస్ మంజూరైందన్నా రు. కార్యక్రమంలో ఎల్బీనగర్ కేంద్ర అగ్నిమాపక అధికారి పి.శ్రీధర్, అగ్నిమాపక అధికారి –2 బి.నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు.
● సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాసులు
చేవెళ్ల: క్షణికావేశంలో, తెలిసీ తెలియక చేసిన తప్పులతో పెట్టుకున్న కేసులను పశ్చాతాపంతో సరిచేసుకునేందుకు అవకాశం కల్పించేందుకే లోక్ అదాలత్‌లు ఉన్నాయని జిల్లా అదనపు న్యాయమూర్తి (ఏడీజే) బి.శ్రీనివాసులు అన్నారు. చేవెళ్ల కోర్టు ఆవరణలో ఆదివారం నేషనల్ లోక్ అదాలత్‌ను చేవెళ్ల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి దశరథరామయ్య, జూనియర్ జడ్జి ఉపాధ్యాయ విజయ్‌కుమార్, రిటైర్డ్ జడ్జి సాంబశివతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను ఇరువర్గాల ఒప్పందాలతో లోక్‌అదాలత్‌ల ద్వారా రాజీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ లోక్ అదాలత్‌లో 1,019 కేసులు పరిష్కరించటంతోపాటు రూ.24,57,200 జరిమానా విధించినట్లు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సి.మహేశ్‌గౌడ్, ప్రభుత్వ అభియోక్త గీతా వనజాక్షి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె.కుమార్, గ్రేడ్–2 ఏసీపీ అలేపా రాణి, ప్రధాన ఏపీపీ నూతన్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
కొహెడను డివిజన్‌గా ప్రకటించాలి


