యూరియా.. ఇక సులువయా!
పంటల వారీగా ఎకరాకు యూరియా కేటాయింపు
● రైతుల కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్
● స్లాట్ బుక్ చేసుకోగానే ఎరువులు
● నిరీక్షణకు పడనున్న తెర
● రేపటి నుంచి అందుబాటులోకి సేవలు
కొందుర్గు: రైతుల అవసరం మేరకు యూరియా అందించేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌నకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది రబీ సీజన్ నుంచే ఇది అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా ఒకవైపు పంటల నమోదుతోపాటు మరోవైపు ఎరువులు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి యాప్ రైతులకు అందుబాటులోకి వస్తుంది. యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద వేచి చూడకుండా.. సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన యాప్‌పై ఇప్పటికే అధికారులు ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకున్న పంటల వివరాలు కేవలం యూరియా కోసమే కాదని పంటల ఉత్పత్తి అనంతరం మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
స్లాట్ బుక్ చేయడం ఇలా..
● ప్లేస్టోర్ ద్వారా రైతులు తమ స్మార్ట్ ఫోన్‌లో ఫర్టిలైజర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
● మొదటగా పట్టాదారు పాసుపుస్తకం నంబర్ నమోదు చేయాలి.
● పీపీబీలో ఉన్న భూమి విస్తీర్ణం కనిపిస్తుంది. అందులో సాగు విస్తీర్ణం పంటల వారీగా నమోదు చేయాలి.
● అనంతరం పంటల వారీగా ఎకరాకు యూరియా కేటాయింపు నమోదు అవుతుంది.
● జిల్లాలో ఏ దుకాణంలో ఎంత స్టాకు ఉంటుందో తెలుసుకోవచ్చు.
● రైతులే తమకు అనుకూలమైన షాపులను ఎంపిక చేసుకోవచ్చు.
● యూరియా బుకింగ్ అనంతరం రైతు ఐడీ వస్తుంది. ఈ ఐడీ ద్వారా ఎంపిక చేసుకున్న దుకాణంలో 24 గంటల వ్యవధిలో యూరియా తీసుకోవచ్చు.
వరి 2.5 బస్తాలు
మొక్కజొన్న 3.5 బస్తాలు
చెరుకు 5 బస్తాలు
మిర్చి 5బస్తాలు
ఇతరపంటలు 2బస్తాలు


