ఓటేయలేదని చితకబాదారు
● కుటుంబ సభ్యులంతా కలిసి దాయాదిపై దాడి
● చికిత్స పొందుతున్న బాధితుడు
యాచారం: ఎన్నికల్లో ఓడిపోయిన ఓ అభ్యర్థి.. తన పరాజయానికి కారణమయ్యాడంటూ ఓ వ్యక్తిని చితకబాదారు. మండల పరిధిలోని చౌదర్‌పల్లి జీపీ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన బోద్రమోని రవీందర్ 7 ఓట్లతో తేడాతో ఓటమిపాలయ్యాడు. తనకు ఓటేయకపోగా, పరాజయానికి కారణమయ్యాడంటూ దాయాది బోద్రమోని మల్లేశ్‌పై అనుమానం పెంచుకున్నాడు. రెండు రోజులుగా అతని కదలికలపై నిఘా పెట్టాడు. శుక్రవారం ఉదయం మల్లేశ్ తన పిల్లలను స్కూల్ బస్ ఎక్కించేందుకు బైక్‌పై వెళ్తుండగా అడ్డుకున్న రవీందర్, అతని తల్లి నాగమణి, తండ్రి నారాయణ, తమ్ముడు రాజేశ్ కలిసి చితకబాదారు. తీవ్ర గాయాలైన మల్లేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
స్కూటీని ఢీ కొట్టిన కారు
మహిళ దుర్మరణం
నందిగామ: స్కూటీని కారు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని మేకగూడ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన సుమిత్ర(30) శుక్రవారం స్కూటీపై పొలానికి బయలుదేరింది. ఇన్ముల్‌నర్వకు చెందిన ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
నలుగురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం తెలిపారు. అల్మాస్‌గూడకు చెందిన అవుల శ్రీనివాస్ దుబాయ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించాడు. అక్కడ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో శ్రీనివాస్ ఇండియాకు వచ్చాడు. అప్పటినుంచి రాజస్థాన్ వ్యక్తి శ్రీనివాస్‌తో వాట్సాప్ కాంటాక్ట్‌లో ఉన్నాడు. కరెంట్ బ్యాంక్ ఖాతాలను అందిస్తే కరెంట్ ఖాతాల్లో డిపాజిట్ అయ్యే డబ్బులో 25 శాతం కమీషన్ ఇస్తామని ఆఫర్ చేశాడు. దీంతో శ్రీనివాస్ తన మిత్రుల సహకారంతో బెంగళూరుకు వెళ్లి కేరళకు చెందిన ఇద్దరికి కరెంట్ బ్యాంక్ వివరాలను అందించగా, శ్రీనివాస్‌కు రూ.2.5 లక్షల కమీషన్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని శ్రీనివాస్,సతీష్, రాజేందర్, మైఖేల్ రెడ్డిలు పంచుకున్నారు. ఈ ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్‌మెంట్ మోసాల కోసం వినిగించారు. ఇందులో దేశవ్యాప్తంగా నమోదైన 94 సైబర్ నేరాలకు సంబంధించి 6.29కోట్ల లావాదేవీలు జరిగాయి.


