
అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు
షాద్‌నగర్‌రూరల్: అంగన్‌వాడీల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు మహాసభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా రాజుతోపాటు అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు. వేతనాలు పెంచడంతో పాటు ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ల్యాప్‌ట్యాప్‌లు అందజేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలను మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం షాద్‌నగర్ ప్రాజెక్టు నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జయమ్మ, ఉపాధ్యక్షులుగా అరుణ, జయమ్మ, కార్యదర్శిగా ఊర్మిళ, కోశాధికారిగా శ్రీదేవి, సహాయ కార్యదర్శులుగా సంతోష, జయమ్మతో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బీససాయిబాబ, శ్రీనివాస్, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.