
విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు
యాచారం: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. నక్కర్తమేడిపల్లిలోని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణాను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. నేరాల నివారణ, మహిళల భద్రత, సైబర్ నేరాల అప్రమత్తత, ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాలో సిబ్బందికి సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ శుభ్రత, ఫిర్యాదుల నమోదు, పెండింగ్ కేసుల వేగవంతం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై వివరించారు. ఆమె వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం: వినాయకుల నిమజ్జనం ఏర్పాట్లను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆమె శేరిగూడ చెక్ డ్యాం, పరిసరాలను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చివెళ్లే మార్గాలపై ఆరా తీశారు. ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
నందిగామ: నానో యూరియా ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ద్రవరూప ఎరువు అని, దీంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందొచ్చని జిల్లా వ్యవసాయాధికారిణి ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడారు. సాంప్రదాయ గుళికల రూపంలో ఉన్న యూరియాతో పోలిస్తే నానో యూరియా ధర తక్కువగా ఉండటమే కాకుండా పనితీరు బాగుంటుందని చెప్పారు. సాంప్రదాయ యూరియా వెదజల్లిన సమయంలో నీటిలో కరిగి, గాలిలో ఆవిరి రూపంలో వృథా అవుతుందని, మొక్కలకు 30–40 శాతం ఎరువు మాత్రమే అందుతుందని అన్నారు. నానో యూరియా నేరుగా పత్ర రంధ్రాల ద్వారా మొక్కల్లోకి వెళ్లి 90 శాతం వరకు సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రైతులు నానో యూరియాపై అవగాహన పెంచుకుని వాడుకోవాలని సూచించారు. అనంతరం చేగూరు, నందిగామ పీఏసీఎస్‌లలో రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఏడీఏ రమాదేవి, ఏఓ శివరామరావు, ఏఈఓ శీరీష, రవి తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత శివరామాలయాలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని, మంగళవారం జిల్లా దేవాదాయశాఖ సహయ కమిషనర్ చంద్రశేఖర్ సమక్షంలో లెక్కించారు. మొత్తం 90 రోజులకు సంబంధి హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.22,48,653 సమకూరింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరా బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ శిరోలీ, నిర్వాహకులు, ఆలయ అర్చక సిబ్బంది, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, కెనరాబ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు