
రాత్రికిరాత్రే బదిలీ!
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులను రాత్రికిరాత్రే బదిలీ చేశారు. ఈ నెల 22న బదిలీలకు రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ డీసీసీబీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు పైబడి విధులు నిర్వర్తిస్తున్న వారిని బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ స్థానానికి ఆప్షన్లు పెట్టుకోవడంపై రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఆరు నెలల క్రితమే పీఏసీఎస్ కార్యవర్గాల పదవీ కాలం ముగియడం, తాజాగా రెండో మారుసారి ఆరు నెలల పదవీ కాలం పొడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యదర్శులు తమ బదిలీ ఉత్తర్వులపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇన్‌చార్జి పాలనలో ఏ విధంగా బదిలీ చేపడతారని, హైకోర్టును ఆశ్రయించి ప్రక్రియను నిలిపేసేలా చూసుకుంటామని మొండికేశారు. ఈ క్రమంలో బదిలీఅయిన కార్యదర్శులు వెంటనే విధుల్లో చేరని పక్షంలో స్టాఫ్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించే విధంగా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని మండలాల్లో యూరియా కొరత, రైతులు ఆందోళనల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టే విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఏళ్లుగా పాతుకుపోయి..
సర్కార్ ఆదేశాల మేరకు పీఏసీఎస్ కార్యదర్శుల బదిలీ ప్రక్రియను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ అధికారులు పూర్తి చేశారు. నగరంలోని డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) కార్యాలయంలో సోమవారం సాయంత్రం కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి, వెంటనే ఆప్షన్లు స్వీకరించి రాత్రి పది గంటలలోపే ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 పీఏసీఎస్‌లకు గాను 56 మంది కార్యదర్శులు ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒకే పీఏసీఎస్‌లో మూడేళ్లకు మించి విధుల్లో ఉండరాదు. కాని ఎంతో మంది 20 ఏళ్లకు పైబడి కొనసాగుతున్నారు. కొన్ని పీఏసీఎస్‌ల్లో సరైన విధంగా నివేదిక పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అర్హులైన వేలాది మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోయారు. మరికొన్ని పీఏసీఎస్‌ల్లో చైర్మన్లే బినామీల పేర్ల మీద రుణాలు తీసుకోవడం, డైరెక్టర్లకు రూ.లక్షలాది రుణాలిచ్చి మళ్లీ చెల్లించకపోవడంతో ఆయా పీఏసీఎస్‌లు దివాలా తీశాయి. రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో ఏళ్లుగా పాతుకుపోయిన కార్యదర్శులను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సహకార శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈమేరకు డీసీసీబీ ఉన్నతాధికారులు కార్యదర్శుల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మందికి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. కాగా, సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు పొందిన కార్యదర్శులు మంగళవారం ఎక్కడా బాధ్యతలు చేపట్టకపోవడం విశేషం.
పీఏసీఎస్ ఉద్యోగులకు
స్థాన చలనం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 మంది..
ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీబీ ఉన్నతాధికారులు
ఇన్‌చార్జి పాలనలో ఎలా చేస్తారని కార్యదర్శుల గుర్రు
బాధ్యతలు చేపట్టకపోతే స్టాఫ్ అసిస్టెంట్లకు అప్పగించాల్సి వస్తుందని అధికారుల హెచ్చరిక