
పరిహారం చెక్కుల పంపిణీ
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో భాగంగా ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుంచి మీర్‌ఖాన్‌పేట 200 అడుగుల ఫార్మా రహదారి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో నిర్మించతలపెట్టిన రేడియల్ రోడ్డు నిర్మాణానికి ముందడుగు పడింది. రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న కొందరు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రాగా వారికి అధికారులు పరిహారం చెక్కులు అందించారు. గతంలో ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుంచి కొంగర, లేమూరు, రాచులూరు, తిమ్మాపూర్ తదితర గ్రామాల మీదుగా రేడియల్ రహదారి నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే పనుల అనంతరం పలుమార్లు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 38.38 ఎకరాల్లోని 49 మంది రైతులకు మంగళవారం కందుకూరు ఎంపీడీఓ సమావేశ హాల్‌లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి చేతుల మీదుగా పరిహారం చెక్కులు అందజేశారు. రాచులూరులో 34 ఎకరాలకు గాను 43 మంది రైతులకు ఎకరాకు రూ.96,16,813 చొప్పున, తిమ్మాపూర్‌లో 4.34 ఎకరాలకు గాను ఆరుగురు రైతులకు ఎకరాకు రూ.82,43,052 చొప్పున అందించారు. అదనంగా ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న లేఅవుట్‌లో ఎకరాకు 121 గజాల స్థలం అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఫ్యూచర్‌సిటీ రేడియల్ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం మెరుగైన పరిహారం ఇవ్వడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సంప్రదింపులు జరిపిన తర్వాత భూసేకరణ చట్టం కంటే అదనంగా పరిహారం రైతులకు అందుతోందన్నారు. అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రేడియల్ రోడ్డు నిర్మాణానికి ముందడుగు