
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీ ఫుట్ బాల్ పాలిటిక్స్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా ప్రచురితమవుతున్న అసంతృప్తి కథనాలను తోసిపుచ్చుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ బీజేపీ వ్యవహారంపై అసంతృప్తితోనే తాను ఫుట్‌బాల్ గిఫ్ట్ ఇచ్చినట్లు వస్తున్న కథనాలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్ ఆడాలనే తీసుకొచ్చానంటూ ప్రకటించారు. ‘‘తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్‌తోనే బీజేపీకి పోటీ. రేవంత్ మంచి ఫుట్‌బాల్ ప్లేయర్. అందుకే ఎలా ఆడుకోవాలో తెలియజేయడానికే ఫుట్‌బాల్ తీసుకొచ్చా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్ ఆడుతాం అని అన్నారాయన.
ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్‌బాల్ ఇవ్వడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారని.. అధిష్టానం పెద్దలు ఒకరి దగ్గరకు వెళ్తే.. మరొకరి దగ్గరికి వెళ్లమంటూ ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని.. ఈ నేపథ్యంలోనే ఇలా ఫుట్‌బాల్ ఇచ్చి నిరసన తెలిపారనే చర్చ నడిచింది.ఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందిస్తూ.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఫుట్‌బాల్స్ బయటకు వస్తాయంటూ తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈలోపే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఖండనకు దిగడం గమనార్హం.

‘ఏదైనా విషయంపై మిమ్మల్ని కలిస్తే పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావును కలవమని, ఆయన్ను కలిస్తే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్‌పాటిల్‌ను కలవమని చెబుతూ నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. అందుకే మీకు అదే బహుమానంగా ఇస్తున్నాను.. మంగళవారం కొండా చేసిన వ్యాఖ్యలు..
ఇదీ చదవండి: ఎంత బాధ ఉంటే ఆయన అలా చేస్తారు?