
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో సిమెంట్ ట్యాంకర్ కింద పడి తండ్రీ కూతురు మృతిచెందిన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడానికి అంగీకరించకుండా అంతా కలిసి న్యాయం చేయాలంటూ హైదరాబాద్ –బీజాపూర్ రహదారిపై ధర్నాకు దిగారు. వారికి కోట్‌పల్లి మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మద్ద తు పలికారు. రోడ్డు ప్రమాదంలో రవీందర్, ఆయన 13 ఏళ్ల కూతురు కృప మృతితో భార్య రత్నమ్మ, ఆరేళ్ల కొడుకు మాత్రమే మిగిలారని, వారికి ఎలాంటి ఆధారం లేదన్నారు. రత్నమ్మ కాంట్రాక్టపై ఏఎన్‌ఎంగా పనిచేస్తోందని ఆమె ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ యజమాని రావాలని పట్టుబట్టారు. ఆందోళనతో మూడు గంటలపాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. తహసీల్దార్ కృష్ణయ్య, చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్ ఆందోళనకారులకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఆయన తగిన విధంగా సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఉన్న మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
మృతి చెందిన తండ్రీకూతురు బంధువులు, గ్రామస్తుల ఆందోళన
హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ధర్నా
మూడు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్
స్పీకర్ ప్రసాద్‌కుమార్ హామీతో విరమణ