
మూడు రోజులైనా దొరకని ఆచూకీ
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు చూసేందుకు వచ్చి కృష్ణా నదిపై నిర్మించిన కొత్త వంతెన పైనుంచి దూకిన యువకుడి ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని శివ(23) తన స్నేహితులైన దుసరి ప్రసాద్(గణేశ్), సొప్పరి శివ, పండుగ నర్సింహతో కలిసి ఈ నెల 4న నాగార్జునసాగర్ పర్యటనకు వెళ్లారు. నందికొండ మున్సిపల్ పరిధిలోని పైలాన్ కాలనీలో కృష్ణా నదిపై ఉన్న కొత్త వంతెన మీద నిలబడి ఫొటోలు దిగే క్రమంలో శివ వంతెన పైనుంచి కృష్ణా నదిలోకి దూకి గల్లంతయ్యాడు. శివ తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు సాగర్ సీఐ శ్రీనునాయక్, విజయపురి టౌన్ ఎస్‌ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు.
కృష్ణానదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు