
విన్యాసాలు అదుర్స్
ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో దేశ రక్షణ, వాయుసేన దళాలు శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జీ), భారత రక్షణ వాయుసేన (ఐఏఎఫ్) సంయుక్తంగా హెలికాప్టర్ల సాయంతో ‘హై–ఇంటెన్సిటీ రూఫ్ టాప్ స్లిదరింగ్’ పేరిట విన్యాసాలు ప్రదర్శించాయి. ఉగ్రమూకల దాడులు, యుద్ధ పరిస్థితులు, ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటే .. అలాంటి విపత్కర, అత్యవసర సమయాల్లో ప్రజలను ఏ విధంగా కమాండోలు కాపాడతారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ గగన్‌దీప్ సింగ్ కోహ్లి, ఎండీ హెచ్‌ఎస్ సైనీ, ఎన్‌ఎస్‌జీ దళాల కమాండోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.