
న్యాయవాది బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఓ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇబ్ర హీంపట్నం పీఎస్ పరిధిలో గురవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపటేల్‌గూడకు చెందిన న్యాయవాది పి.నరేందర్‌గౌడ్(34)కు ఇదే వృత్తిలో ఉన్న చంద్రికతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇరువురూ ఇబ్రహీంపట్నం న్యాయస్థానంలో కేసులు వాదిస్తున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నరేందర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో కోర్టుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అతన్ని వెతుకుతున్న క్రమంలో తమ వ్యవసాయ క్షేత్రంలోని పశువుల కొట్టంలో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాడీని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.