
మందుల్లేవ్!
కడ్తాల్: కడ్తాల్‌తో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశు పోషణ చేపడుతున్నారు. ముప్పై, నలభై ఏళ్లుగా పాడి పరిశ్రమతో ఉపాధి పొందుతున్నారు. పశు సంపద అదనపు ఆదాయ వనరు కావడంతో, సాగు భూమిలోని కొంత విస్తీర్ణంలో గడ్డి పెంచడం వీరికి అలవాటుగా మారింది. సొంత భూమి లేనివారు సైతం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా వీటికి ఏవైనా వ్యాధులు సోకితే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేకపోవడం చికిత్సలకు ఇబ్బందిగా మారుతోంది. వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పశు సంపద భారీగా ఉండటంతో వెటర్నరీ హాస్పిటాళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మందుల కొరత పెద్ద సమస్యగా మారింది. తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక, ఆర్థికంగా భారమైన ప్రైవేటుగా మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పశువులకు సోకే వ్యాధులు
పశువులకు కాలన్ని బట్టి వచ్చే వ్యాధులతో పాటు, సాధారణ వ్యాధులు సోకుతాయి. ప్రస్తుతం వర్షకాలం కావడంతో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జ్వరం, పారుడు రోగం, చర్మవ్యాధులు, గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు, గురక, మసూచి, జీర్ణ సంబంధ వ్యాధులు, నోట్లో పుండ్లు పడుతుంటాయి.
నిలిచిన మందుల సరఫరా
పశు సంవర్ధక శాఖ అధికారులు ఏడాదికి నాలుగు విడతల్లో వెటర్నరీ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తుంది. మండల పరిధిలోని పశు సంపద ఆధారంగా వీటిని పంపిణీ ఉంటుంది. కానీ గతేడాది అక్టోబర్ నుంచి మందుల సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మూగజీవాలకు రోగా లొస్తే మందులు అందుబాటులో ఉండటం లేదు.
అవగాహన అంతంతే..
పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. సీజనల్ వ్యాక్సిన్లు వేసే సమయంలో రైతులకు ఒకటి, రెండు మాటలు చెప్పి మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా వ్యాధులపై సరైన అవగాహన లేక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.
సబ్ సెంటర్లు తక్కువే..
మండలంలో 24 జీపీలు ఉండగా, కడ్తాల్‌లో పశువైద్య కేంద్రం ఉంది. మండల పరిధిలోని 5 గ్రామాల్లో సబ్ సెంటర్లు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌తో పాటు, ఎల్‌ఎస్‌ఏ, జేవీఓలు ముగ్గురు, అఫీస్ సబార్డినేట్లు నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ముద్వీన్, చల్లంపల్లి గ్రామాల్లో సరిపడా సిబ్బంది ఉండగా, రావిచేడ్‌లో సబార్డినేట్ పోస్ట్ ఖాళీగానే ఉంది. అన్మాస్‌పల్లిలో పశువైద్య ఉప కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుని, సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ముద్వీన్, కర్కల్‌పహాడ్ గ్రామాల్లో భవనాలు లేవు. పూర్తి స్థాయి సేవలు అందాలంటే పంచాయతీకి ఒకటి చొప్పున సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉండటం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు మెడికల్ షాపుల యజమానులు వారికి నచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు.
వెటర్నరీ ఆస్పత్రుల్లో మెడిసిన్ సమస్య
పది నెలలుగా ప్రభుత్వం నుంచి నిలిచిపోయిన సరఫరా
గత్యంతరం లేక ప్రైవేటులో తేవాలంటున్న వైద్యులు, సిబ్బంది
సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్న మూగజీవాలు
ఆందోళనలో రైతులు, పశుపోషకులు
మండలంలో పశు సంపద
ఆవులు 17,314
గేదెలు 2,017
గొర్రెలు 16,643
మేకలు 7,868
కోళ్లు 7,98,491
కుక్కలు 1.561
పందులు 1,127