
దోమలు కుట్టి.. జబ్బు పట్టి
విష జ్వరాల బారినపడుతున్న జనం
ఏకధాటి వర్షాలకు పారిశుద్ధ్యలోపం తోడవడంతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. అనేక మంది కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలతోబాధపడుతున్నారు. ఏ ఇంట్లోకి తొంగి చూసినా జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. సర్కారు దవాఖానాలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని 56 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని ఓపీకి మే నెలలో 1,32,442 మంది బాధితులు రాగా, జూన్‌లో 1,34,725 మంది వచ్చారు. జూలైలో ఏకంగా 1,43,962మందికి చేరుకున్నారు. ప్రతి నెలా పది వేల మందికిపైగా విషజ్వరాల బారినపడుతున్నట్లు అంచనా. తాజాగా డెంగీ దోమలు సైతం పంజా విసురుతుండటంతో పల్లె వాసులే కాదు.. పట్టణ ప్రాంత ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. కొంత మంది వైద్యులు డెంగీ జ్వరాలను బూచీగా చూపి సాధారణ జ్వరపీడితులను ప్లేట్‌లెట్స్ కౌంట్స్, ఇతర చికిత్సల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 142 డెంగీ కేసులు నమోదు కాగా, హెచ్1ఎన్1(స్వైన్‌ఫ్లూ) కేసులు 14 నమోదు కావడం ఆందోళన కగిలిస్తోంది. కలుషిత నీరు, ఆహారంతో అనేక మంది వాంతులు, విరేచనాలు, విష జ్వరాల బారినపడుతున్నారు.
కునుకు లేకుండా చేస్తున్న దోమలు
తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 142 డెంగీ కేసులు నమోదు కాగా, వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 77, శివారు మున్సిపాలిటీల్లో 53 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 12 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, ధనవంతులు ఎక్కువగా నివసించే శేరిలింగంపల్లి పీహెచ్‌సీలో 41, నార్సింగి పీహెచ్‌సీలో 29, సరూర్‌నగర్‌లో16, బాలాపూర్‌లో 11, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 11, మైలార్‌దేవ్‌పల్లిలో 8, చించోడులో ఏడు చొప్పున కేసులు నమోదవడం విశేషం. ఆకర్షణ, ఆహ్లాదం కోసం ఇంటి ముందు కుండీల్లో మనీప్లాంట్స్, ఖాళీ ప్రదేశంలో రకరకాల పూలు, పండ్ల మొక్కలుపెంచుతున్నారు. ఏకధాటి వర్షాలకు ఆయా కుండీలు, ఇంటిపై ఖాళీ డబ్బాలు, ఇంటి పక్క ఖాళీ స్థలాల్లో పడేస్తున్న కొబ్బరి బొండాలు, టైర్లలో నీరు చేరి దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులపైనే కాదు సెల్లార్‌లో ఉన్న సంపులపై కూడా మూతలు లేకపోవడం, నిర్మాణాల కోసం తవ్విని సెల్లార్ గుంతల్లో నీరు చేరడం, స్లాబులు, గోడల క్యూరింగ్ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వ ఉంటూ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయకపోవడంతో ఇవి మరింత వృద్ధి చెంది కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీ ఏకధాటి వర్షాలతో డయేరియా ముప్పు ఆస్పత్రులకు క్యూకడుతున్న జ్వరపీడితులు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాలో నమోదైన సీజనల్ వ్యాధులు
మాసం ఫీవర్ డయేరియా రక్తవిరేచనాలు స్వైన్‌ఫ్లూ డెంగీ
జనవరి 11,215 98 119 03 09
ఫిబ్రవరి 10,891 111 114 03 02
మార్చి 11,511 117 143 01 02
ఏప్రిల్ 11,025 79 86 01 04
మే 10,718 58 138 – 18
జూన్ 10,202 77 119 – 45
జూలై 10,778 78 109 05 53
ఆగస్టు (7వరకు) 1,752 08 19 01 09
అప్రమత్తం చేశాం
కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్‌ఎంలు, ఆశాలు ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పర్యటించారు. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన హైరిస్క్‌జోన్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య మెరుగు కోసం చర్యలకు సిఫార్సు చేశాం. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నాం. అన్నిరకాల పరీక్షలతో పాటు మందులను ఉచితంగా అందజేస్తున్నాం. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
– డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి