
ఉత్సవాలకు ఆహ్వానం
తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షిక వేడుకలు ఈనెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు రావాలంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, నాయకులు జెల్లాల లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధిలో
ఉచిత శిక్షణ
మొయినాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ఆర్‌సెటీ డైరెక్టర్ మహ్మద్ అలీఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం(ఆర్‌సెటీ)లో కార్ డ్రైవింగ్, మొబైల్ రిపేరింగ్, బైక్ మెకానిక్, సీసీటీవీ కోర్సుల్లో నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ నెల 11న శిక్షణ మొదలవుతుందని.. 18–45 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ మె మో, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలతోపాటు నాలుగు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలతో ఈ నెల 9న ఆర్‌సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యంతోపాటు ట్రైనింగ్ మెటీరియల్, టూల్ కిట్స్ ఉచితంగా అందజేయనున్నట్టు చెప్పారు. వివరాలకు 95506 06019, 85001 65190 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పాల ఉత్పత్తులపై
అవగాహన
యాచారం: పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం గునుగల్, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్‌రెడ్డి, ఫార్మర్ డీన్ డాక్టర్ రఘునందన్ తదితరులు శాసీ్త్రయ పద్ధతిలో పాడిపశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై మహిళా రైతులకు అవగాహన కల్పించారు. పశుపోషణ, తక్కువ ఖర్చుతో షెడ్ల నిర్మాణం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వంటి అంశాలను వివరించారు. కలాకండ్, పన్నీరు, చన్నారసగుల్లా, రసమలై, మజ్జిగ, లస్సీ తదితర పదార్థాల తయారీపై అవగాహన కల్పించి, శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు రత్నాకర్, శశికుమార్, సాహిత్యరాణి, మండల వ్యవసాయాధికారి రవినాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాలకు ఆహ్వానం