గ్రామాల్లో బిహార్ బృందం పర్యటన
కందుకూరు: బిహార్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం మండల పరిధిలో పర్యటించింది. అక్కడి ప్రజాప్రతినిధులు 126 మంది హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ(డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం)లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దాసర్లపల్లి, ముచ్చర్ల గ్రామాల్లో పర్యటించారు. దాసర్లపల్లిలో ఫాంపాండ్, ముచ్చర్లలో శ్మశానవాటిక, కంపోస్టు యార్డ్, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల, నర్సరీ, పౌల్ట్రీ షెడ్ తదితరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు.. పంచాయతీలో మౌలిక సదుపాయాలు ఏవిధంగా సమకూరుస్తున్నారు.. ఇంటి పన్నులు ఏవిధంగా వసూలు చేస్తున్నారు.. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎలా వినియోగించుకుంటున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి అభివృద్ధి పనులు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఏపీడీ చరణ్, ఏపీఓ రవీందర్‌రెడ్డి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఫ్యాకల్టీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు లావణ్య, రమేష్, ఇంద్రసేన్, మహేశ్, ఈశ్వరి, రాజేష్, ఎఫ్‌ఏ వెంకటేశ్ పాల్గొన్నారు.


