సమన్వయంతోనే ప్రమాదాల నియంత్రణ
సాక్షి,సిటీబ్యూరో: అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విద్యుత్, టౌన్‌ప్లానింగ్, హైడ్రా, ఫైర్‌సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుల్జార్‌హౌస్ తదితర అగ్నిప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా విభాగాలు ప్రజలకు తగిన సూచనలివ్వాలన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాపార సముదాయాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా నిరోధించే చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. హెరిటేజ్ భవనాలతో సహా అన్ని భవనాల్లోనూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి పరికరాలు వాడాలో విద్యుత్ అధికారులు ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి, ఎలక్ట్రిక్ షాపులు నిర్వహించే వారికి దశలవారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిస్కమ్ సీఈకి సూచించారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు, ట్రేడ్‌లైసెన్స్ జారీ చేసే అధికారులు ఫైర్‌సేఫ్టీ మెజర్స్ తప్పనిసరిగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నెలలో ఒకరోజు ఫైర్ సేఫ్టీపై అవగాహనకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ, శిథిలావస్థలో ఉన్న భవనాలను సర్వే చేయనున్నట్లు చెప్పారు. వ్యాపార భవనాల్లో ఫైర్‌సేఫ్టీకి సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్, పోలీస్ శాఖలకు మాత్రమే సమాచారం వెళ్తుందని , రెవెన్యూ సంబంధిత శాఖలకు కూడా సమాచారం ఇవ్వాలన్నారు. తద్వారా జిల్లా యంత్రాంగం తరఫున అంబులెన్‌న్స్, ఆసుపత్రిలో చికిత్స సదుపాయాలు, డాక్టర్లు, బెడ్స్ సిద్ధం చేయడం వంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 15 మీటర్ల లోపు ఉన్న హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్స్,లాడ్జింగ్, హోటల్, బిజినెస్ మాల్స్, స్టోరేజీ బిల్డింగ్‌లు తప్పని సరిగా ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలన్నారు. తప్పని సరిగా స్మోక్ డిటెక్టర్ తో పాటు అలారం కూడా ఉండాలని, ప్రజలు కూడా వీటిని గమనించాలన్నారు.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి


