విస్తరణ లేదు.. వంతెన రాదు!
అబ్దుల్లాపూర్‌మెట్: పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా విజయవాడ జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని వచ్చిన ప్రతిపాదనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నర పాటుగా పనులు కొనసాగుతున్నాయి. తుది దశకు చేరుకున్నాయి. కానీ మధ్యలో ఉన్న అబ్బుల్లాపూర్‌మెట్ కూడలిని విస్మరించారు. విస్తరణ చేస్తారో? పై వంతెనలు నిర్మిస్తారో తెలియదు కానీ.. ఏళ్లు గడుస్తున్నా రహదారి విస్తరణ పనుల్లో స్పష్టత రావడం లేదు.
చౌరస్తాలో ఇక్కట్లు
ఎల్‌బీనగర్ నుంచి దండుమల్కాపూర్ వరకూ 24 కిలో మీటర్ల రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల విస్తరణ పనులకు రూ.600 కోట్లను కేంద్రంమంజూరు చేసింది. కోవిడ్, గుత్తెదారుల సమస్యలతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతూ.. నిర్విరామంగా కొనసాగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. హయత్‌నగర్ చివరి నుంచి దండుమల్కాపూర్ వరకూ రోడ్డు పనులు పూర్తి అయినప్పటికీ, అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో సుమారు రెండు కిలో మీటర్ల విస్తరణ పనులు చేపట్టలేదు. దీంతో చౌటుప్పల్ వైపు నుంచి హైదరాబాద్‌కు, నగరం నుంచి చౌటుప్పల్‌కు వెళ్లే వాహన దారులు.. అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో ఇబ్బంది పడుతున్నారు. ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ జాం అవుతోంది.
వాహనాల రద్దీ..
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిత్యం రద్దీగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై చేపడుతున్న పనుల్లో 8 ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల్లో పై వంతెనలు పూర్తయ్యాయి. ఎల్‌బీనగర్ నుంచి దండు మల్కాపూర్ రోడ్డు విస్తరణలో వనస్థలిపురం పనామా కూడలి వద్ద, హయత్‌నగర్‌లో కుంట్లూర్ రోడ్డు వద్ద, అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో ఘట్‌కేసర్ రోడ్డు, అనాజ్‌పూర్ రోడ్డు వద్ద మినహా.. పెద్దఅంబర్‌పేటలో పసుమాముల రోడ్డు, కొహెడ రోడ్డు వద్ద,ఇనాంగూడ, బాటసింగారం కూడళ్ల వద్ద బ్రిడ్జిలు పూర్తి కాగా.. వాహనాల రాకపోకలకు అనుమతించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో గండిమైసమ్మ దేవాలయం నుంచి మయూరి కాంట వరకు రెండు వైపులా నిలిచిన రోడ్డు విస్తరణ చేపడితే.. 24 కిలోమీటర్ల రహదారి విస్తరణ పూర్తవుతుందని, అప్పుడు కూడలిలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోతాయని స్థానికులు పేర్కొంటున్నారు.
అభివృద్ధికి నోచుకోని కూడలి
ఇరుకు రోడ్డుతో వాహనదారుల ఇబ్బంది
మూడు వరుసలతో హైవే నిర్మాణం పూర్తి
అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిలిచిన పనులు


