మహనీయుల స్ఫూర్తితో ఉద్యమబాట
ఇబ్రహీంపట్నం: మహిళలు, దళిత, గిరిజన హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జాతీయ నాయకురాలు టి.జ్యోతి అన్నారు. ఈనెల 14న ప్రారంభమైన పూలే, అంబేడ్కర్ యాదిలో మహిళ హక్కుల పరిరక్షణ యాత్ర రాష్ట్రంలో 18 జిల్లాల్లో కొనసాగింది. ఇబ్రహీంపట్నంలో ఆదివారం ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా హక్కుల పరిరక్షణకు కృషిచేసిన మహనీయులైన జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే, అంబేడ్కర్ స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది వీరమణులు పోరాడి సాధించుకున్న మహిళా హక్కులు ప్రస్తుతం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో రాజ్యాంగం, మహిళల హక్కులను పక్కన పెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. మనుధర్మాన్ని రాజ్యాంగ స్థానంలో అమలు పరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహిళలకు రక్షణ, ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించిందని పేర్కొన్నారు. మున్సిపల్, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికుల, మహిళల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు అరుణజ్యోతి, ఆశాలత, సరళ, నాగలక్ష్మి, శశికళ, సాయిలీల, వినోద, గీత, వరలక్ష్మి, అనురాధ, సుమలత తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి


