పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఏర్పాటు చేసి 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పుర్కరించుకుని శనివారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్‌సెంటర్‌లో యూత్ లీడర్స్ కాంక్లేవ్ ఫర్ బెటర్ ఎర్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో పర్యావరణానికి సంబంధించి సరైన పాఠ్య ప్రణాళికను తయారు చేసి సిలబస్‌లో ప్రవేశపెడతామన్నారు. విద్యార్థులు నవతర పర్యావరణ పరిరక్షకులని, పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు. సమాజ శ్రేయస్సు, పుడమి తల్లి సేవకు సీజీఆర్ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సిటీ ఒక నాలెడ్జ్ హబ్ కావాలని, పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే, మన విద్యార్థులు పర్యావరణాన్ని గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. మన సహజ సంపదను మనం కాపాడుకోవాలని సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టి పర్యావరణ రక్షణకు నడుం బిగించాలన్నారు. పాలసీ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక శక్తిగా మారి, పర్యావరణ రక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ నవీన్‌రావు, డాక్టర్ జగన్, డాక్టర్ వసంతలక్ష్మి, వెంకటేశ్, సీజీఆర్ సిబ్బంది ఉన్నారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి


