సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులపై ఆయన వివరణాత్మక సమీక్ష నిర్వహించారు. రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన సమీక్షించారు. స్టేషన్ బుకింగ్, పార్కింగ్, సర్క్యులేటింగ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పునరాభివృద్ధి పనులను అత్యున్నత ప్రమాణాలతో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తూ కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


