గోతుల దారి.. విమానం చేజారి
తరచూ దెబ్బతింటున్న ఎర్రకుంట రహదారి ● స్తంభించిపోతున్న ట్రాఫిక్ ● సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోతున్న ప్రయాణికులు
పహాడీషరీఫ్: అది హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి.. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రూట్ కావడంతో ఈ రహదారిలో నిత్యం వేల సంఖ్యలో వాహనా లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంత ప్రధానమైన రోడ్డుపై జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ గోతులు పడ్డాయి. దీంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్‌తో విమానాశ్రయానికి వెళ్లే వాహనదారులు విమానాలను అందుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌లు సైతం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుంటుండడంతో రోగుల బంధువులు ఆర్తనాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది.
ప్రమాదాలు జరిగినా స్పందన కరువు
ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మర్రి చెట్టు వరకు రోడ్డు తరచూ పాడవుతుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. రెండేళ్ల క్రితం ఎర్రకుంట చౌరస్తాలో రోడ్డుపై మురుగు నీరు పారి గోతులమయంగా మారింది. ఈ గుంతలో కొంద రు నిర్మాణ వ్యర్థాలు పోయడంతో రోడ్డు ఎగుడు దిగుడుగా మారి పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఐదారుగురు వ్యక్తులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడాల్సి వచ్చింది. చివరకు మున్సిపాలిటీ తరఫున రూ.6 లక్షలు వెచ్చి ంచి ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడంతో కొన్నాళ్ల పాటు వాహనదారులకు ఉపశమనం కలిగింది. మళ్లీ తాజాగా ఎర్రకుంట పెట్రోల్ పంప్ ప్రాంతంలో కూడా ఎగువ బస్తీల మురుగునీరు రోడ్డుపై పారడంతో రోడ్డు గుంతలమయంగా మారింది.
మురుగు నీరు పారడంతో..
శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న తుక్కుగూడ, కందుకూర్, కడ్తాల్ లాంటి పట్టణాలలో విశాలమైన రహదారితో పాటు రోడ్డు మధ్యలో డివైడర్, వర్షం వచ్చిన సమయంలో నీరు సాఫీగా వెళ్లేలా ఇరువైపులా కచ్చామోరీలను నిర్మించారు. జల్‌పల్లి మున్సిపాలిటీలోని ఈ రహదారిపై మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చాంద్రాయణగుట్ట సరిహద్దు దాటిన అనంతరం ఎర్రకుంట నుంచి మొదలుకొని పహాడీషరీఫ్ వరకు రహదారికి ఇరువైపులా కచ్చామోరీలు లేవు. కేవలం యూటర్న్‌లు మినహాయిస్తే పాదచారులు కూడా మధ్యలో రోడ్డు దాటకుండా ఇనుప కంచెలను నిర్మించ లేదు. సెంట్రల్ లైటింగ్ సిస్టం కూడా అసంపూర్తిగానే ఉంది. షాహిన్‌నగర్ హైవే హోటల్ పరిసరాలలో మురుగునీరు ఏడాది పొడవునా రోడ్డుపైనే పారడం అలవాటుగా మారిపోయింది. రోడ్లపై మరమ్మతులు కూడా చేయకుండా అటు ఆర్‌అండ్‌బీ అధికారులు పెట్టిన నిబంధనలతో స్థానిక మున్సిపాలిటీ అధికారులు వెనుకంజ వేస్తున్నారు.
రోడ్డుపై అడ్డంకులు ఉండొద్దు
ఎర్రకుంట నుంచి పహాడీషరీఫ్ వరకు రహదారిపై అడ్డంకులు లేకుండా ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకోవాలి. ఈ రోడ్డు దుస్థితి చూసి చాలా మంది ప్రత్యామ్నాయంగా ఆర్సీఐ, బాలాపూర్ రూట్‌లో వెళుతున్నారు. ఎర్రకుంటలో కిలోమీటర్ మేర డివైడర్ లేకపోవడంతో స్థానిక వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ వాహనాల మధ్యలో యూటర్న్‌లు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
– సయ్యద్ ఫెరోజ్, షాహిన్‌నగర్
గోతుల దారి.. విమానం చేజారి


