‘భూ భారతి’తో సమస్యలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

‘భూ భారతి’తో సమస్యలకు చెక్‌

Apr 18 2025 5:35 AM | Updated on Apr 18 2025 5:35 AM

‘భూ భారతి’తో సమస్యలకు చెక్‌

‘భూ భారతి’తో సమస్యలకు చెక్‌

షాద్‌నగర్‌: భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో హక్కుల రికార్డు సవరణ కోసం అవకాశం లేదని, తప్పుల సవరణ కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. కొత్త భూ భారతి చట్టంలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందన్నారు. నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధార్‌ తరహాలోనే భవిష్యత్తులో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్ర వివరాలతో భూధార్‌ కార్డును జారీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త చట్టంలోని అంశాలపై పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, ఆర్‌డీఓ సరిత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సులోచన, వైస్‌ చైర్మన్‌ బాబర్‌ఖాన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, తహసీల్దార్‌ పార్థసారధి, ఏడీఏ రాజరత్నం, ఏఓ నిషాంత్‌కుమార్‌, ఎంపీడీఓ బన్సీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

కేశంపేటలో అవగాహన సమావేశం

కేశంపేట: భూ భారతి చట్టంపై రైతులు, ప్రజలకు గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో షాద్‌నగర్‌ ఆర్డీఓ సరిత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ హాజరయ్యారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి నూతన చట్టం గురించి వివరించారు. అనంతరం చట్టంపై పలువురి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజరత్నం, తహసీల్దార్‌ అజాంఅలీ, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల, వీరేష్‌, జగదీశ్వర్‌, శ్రీధర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement