అశ్వ వాహనంపై బాలాజీ
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు అశ్వ వాహనంపై ఊరేగారు. ఆలయంలో మహాభిషే కం, ఆస్థాన సేవ, దోప్‌సేవ, పుష్పాంజలి సేవలు అందించారు. వేదపండితుల మంత్రోశ్చరణలు.. భక్తుల గోవింద నామస్మరణలు.. డోలు, డప్పు వాయిద్యాల మధ్య చిలుకూరు బాలాజీ దివ్యరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి దివ్యరథోత్సవం శనివారం అర్థరాత్రి కనుల పండువగా సాగింది. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఆసీనులై దేవాలయం చుట్టూ ఊరేగారు. శ్రీదేవి, భూదేవిలను వివాహం చేసుకున్న స్వామివారు వారిని గ్రామస్తులకు చూపించే క్రమంలోనే రథోత్సవం జరుగుతుందని ఆలయ అర్చకుడు రంగరాజన్ భక్తులకు వివరించారు. రాత్రి 11 గంటలకు స్వామివారు, అమ్మవార్లకు అద్దాలమహల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొదటి అంతస్తులో ఆసీనులను చేశారు. రథం ముందు అర్చకులు హోమం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు కదిలించారు. స్వామి వారి రథోత్సవంలో పాల్గొనటంతోపాటు రథాన్ని తాకితే అంతామంచి జరగుతుందన్న విశ్వాసంతో భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన కన్నయ్య, కిట్టు, మురళి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా రథోత్సవం
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు


