అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపిక
కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లికి చెందిన కర్నేకోట అరుణ్‌తేజ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. నేపాల్‌లో మే 26 నుంచి 31 వరకు జరిగే అంతర్జాతీయ స్థాయి ఇండో నేపాల్ క్రికెట్ పోటీల్లో అండర్– 19 విభాగంలో ఇండియా తరఫున అల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. అరుణ్‌తేజ్ ప్రస్తుతం షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణ నుంచి అండర్ –12, అండర్–14 క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. అనంతరం ఇక్కడి నుంచి ఆడేందుకు అవకాశాలు రాకపోవడంతో నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు మారాడు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యంలో ఒంగోలులో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా ఇండియా టీం తరఫున ఆల్‌రౌండర్‌గా అండర్ –19 విభాగంలో ఎంపికయ్యాడు. మన్సూరాబాద్‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున శిక్షణ పొందుతున్నాడు.
మాల్‌లో ఎంఓఆర్‌డీ బృందం పర్యటన
యాచారం: మండల పరిధిలోని మాల్ గ్రామంలో శుక్రవారం ఎంఓఆర్‌డీ (మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) బృందం పర్యటించింది. ఉన్నతాధికారులు పంకజ్, చంద్రానిషా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరవుతున్న నిధుల ఖర్చు, చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతోంది, నిధులు దుర్వినియోగం అవుతున్నాయా.. అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలతతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఇంటి పన్నుల వసూళ్లు, తాగునీటి సమస్య, ఈజీఎస్ పనులపై ఆరా తీశారు.
ఒకదానికొకటి ఢీకొని..
వరుసగా నాలుగు వాహనాలు ధ్వంసం
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై వాహనాల రద్దీ కారణంగా ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిఽధిలోని ఆలూరు బస్‌స్టేజీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఆలూరు బస్‌స్టేజీ సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఓ ఆటో ఆగి ఉంది. దాని వెనుకే మరో ఆటో వెళ్లి ఆగుతుండగానే గమనించకుండా వెనకాలే వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు ఆగి ఉన్నమరో ఆటోను ఢీకొట్టింది. కారు వెనకాలే వచ్చిన మరో కారు ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. వాహన యజమానులు వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి వారిని చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించి పంపించారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
వృత్తి నైపుణ్యాలతో ఉజ్వల భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: క్రమశిక్షణతో వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుంటే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలక్రిష్ణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని సైంట్ విద్యాసంస్థల 24వ వార్షికోత్సవానికి శుక్రవారం సాయంత్రం అయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతకు ఉపాధి ఆవకాశాలు మెండుగా ఉన్నాయని.. వీటిని అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి తాగుతూ పట్టుబడిన బీటెక్ విద్యార్థులు
ఇబ్రహీంపట్నం: గంజాయి తాగుతున్న ఐదుగురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఇబ్రహీంపట్నంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గురునానక్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు స్థానిక చైతన్యనగర్‌లో నివాసముంటున్నారు. వీరు ఓ ఇంట్లో గంజాయి సేవిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి 290 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసిన వ్యక్తితో పాటు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపిక
అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపిక


