ఆరోగ్యమే.. మహాభాగ్యం
షాద్‌నగర్: ఆరోగ్యమే మాహా భాగ్యమని.. ఆరోగ్య సంరక్షణపై ప్రతీ ఒక్కరు దృష్టి సారించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి నుంచి ఫరూఖ్‌నగర్ పురవీధుల్లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈర సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. సమయానికి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నిత్యం శరీరానికి అవరసమరైన నీటిని సేవించాలన్నారు. వ్యాయామాన్ని నిత్యం అలవాటు చేసుకోవాలని.. ఒత్తిడికి, దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. భోజనంలో మసాలాలు, కారం, పులుపు, వేపుడు పదార్థాలు తగ్గించాలన్నారు. మొలకెత్తిన గింజలు తరుచుగా తీసుకోవాలని, వేడి పదార్థాలను భుజించాలన్నారు. అనారోగ్యానికి గురైన వారు వెంటనే సమీపంలో ఉండే వైద్యులను సంప్రదించి చికిత్సలు చేయించుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ముస్తకిన్ అహ్మద్, జగదీశ్, సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్ వైజర్లు రమ, అమృత, రవికుమార్, లింగం, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి


