నారాయణ సంస్థాన్ సేవలు అభినందనీయం
సైదాబాద్: నిరుపేద దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థాన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మినర్వా ఫంక్షన్‌హాల్‌లో నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్‌ల కోసం ఎంపిక, దివ్యాంగులకు అందజేసే ఆర్టిఫిషియల్ ఉపకరణాల కోసం కొలతల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ.. పుట్టుకతో దివ్యాంగులు, అనారోగ్య కారణాలు, ప్రమాదాలతో దివ్యాంగులుగా మారిన వారిని ఈ శిబిరంలో చూస్తుంటే తన మనసు ఎంతగానో కలచివేసిందన్నారు. ఈ శిబిరంలో 1200 మంది దివ్యాంగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని, వారికి రెండు నెలల్లో నాణ్యతతో కూడిన మాడ్యులర్ కృత్రిమ అవయవాలను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ డైరెక్టర్ వందన అగర్వాల్, దేవేంద్ర చౌబీసా, ట్రస్టీ ప్రభాకర్, భగవాన్ ప్రసాద్‌గౌడ్, హరిప్రసాద్ పాల్గొన్నారు.


