చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
మొయినాబాద్: వీసా గాడ్‌గా పేరొందిన కలియుగదైవం.. చిలుకూరు బాలాజీ స్వామి వారు బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతూ.. తెలంగాణ తిరుపతి గా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయం వేడుకలకు ముస్తాబైంది. ఐదు శతాబ్ధాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి తరువాత దశమి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితి. ఈ నెల 7న సోమవారం సెల్వర్ కూత్తు తోఉత్సవాల అంకురార్పణ చేసి 14న చక్రతీర్థంద్వజావరోహణంతో ముగుస్తాయి.
చివరి దశకు చేరుకున్న ఏర్పాట్లు
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్వామి వారి రథం ఉత్సవాలకు ముస్తాబైంది. వాహన సేవలకు ఉపయోగించే వాహనాలు సిద్ధం చేశారు. ఆలయానికి రంగులు, సున్నం వేయించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతీ శుక్రవారం గరుడ ప్రసాదం
బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అనంతరం గరుత్మంతుడికి పెట్టే నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా వితరణ చేసేవారు. గత ఏడాది గరుడ ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గరుడ ప్రసాద పంపిణీ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. సంతానం లేని మహిళలకు మే నుంచి ప్రతీ శుక్రవారం గరుడ ప్రసాదాన్ని సంతాన భాగ్య ప్రసాదంగా అందజేస్తామని చెప్పారు. గత ఏడాది సైతం ప్రతీ శుక్రవారం గరుడ ప్రసాదాన్ని అందించామన్నారు. ఈ నెలలో గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని చెప్పారు.
రేపటి నుంచి 14 వరకు వేడుకలు
ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయం
గరుడ ప్రసాద పంపిణీకి బ్రేక్
బ్రహ్మోత్సవాల వివరాలు
తేదీ సేవలు
7న సెల్వర్ కూత్తు
8న ధ్వజారోహణం,
శేషవాహన సేవలు
9న గోపవాహన,
హనుమంత వాహన సేవ
10న సూర్యప్రభ, గరుడ
వాహన సేవలు
11న వసంతోత్సవం,
గజవాహన సేవ
12న పల్లకీ సేవ,
అర్ధరాత్రి దివ్య రథోత్సవం
13న మహాభిషేకం, ఆస్థాన
సేవ, అశ్వవాహన,
దోప్, పుష్పాంజలి సేవలు
14న చక్రతీర్థం, ధ్వజావరోహణం
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు


