విత్తన పండుగకు ఆహ్వానం
కడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలో ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ‘తొలి తెలంగాణ విత్తన పండుగ’నిర్వహించనున్నారు. ఈ మేరకు సీజీఆర్ ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆహ్వానపత్రిక అందజేశారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి హాజరవుతానని చెప్పి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాన్ని అభినందించారని తెలిపారు. ఈ సందర్భంగా సీజీఆర్ ప్రతినిధి రజినీకాంత్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న దేశీ విత్తనాల సంరక్షణకు సంస్థ నడుంబిగించిందని చెప్పారు. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఎర్త్ సెంటర్‌లో చేపట్టనున్న విత్తన పండుగలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సంప్రదాయ విత్తనాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే రైతులకు దేశీ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంద యాదగిరి, ఎర్త్ లీడర్ ప్రభాస్ తదితరులు ఉన్నారు.


