పహాడీషరీఫ్: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపునకు గడువు దగ్గర పడుతుండడంతో జల్‌పల్లి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ పరిధిలోని జల్‌పల్లి, శ్రీరాం కాలనీ, పహాడీషరీఫ్, వాదే ముస్తఫా, వాదే సాల్హెహీన్, షాహిన్‌నగర్, ఎర్రకుంట, కొత్తపేట, బిస్మిల్లా కాలనీ, సలాల ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆస్తి పన్నుపై అవగాహన కల్పిస్తున్నారు. తుది గడువులోగా లక్ష్యం చేరుకోవడంపై దృష్టి సారించారు.
రూ.24.76 కోట్లుగా పెరిగిన లక్ష్యం
మున్సిపాలిటీలో మొత్తం 37,332 నివాసాలు, 3,300 ట్రేడ్ లైసెన్స్‌లను కలుపుకొని ఈ ఏడాది ఆస్తి పన్ను లక్ష్యాన్ని రూ.9.26 కోట్లుగా నిర్దేశించుకున్నారు. బకాయిలు రూ.8.33 కోట్లు, జరిమానాలతో కలిపి మొత్తం రూ.24.76 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 27.82 శాతం చొప్పున రూ.6.89 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రజలకు అవగాహన కల్పించేలా బస్తీల్లో ఆటోల్లో మైక్‌లు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. స్వచ్ఛందంగా మున్సిపాలిటీకి వచ్చి చెల్లించే వారి కోసం కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
● సవాల్‌గా వసూలు
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో పన్ను వసూలు అధికారులకు సవాల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం పెరిగిన పన్నులకు ఉన్నతాధికారులు కొంత మేర వెసులుబాటు కల్పించారు. 2023 వరకు పంచాయతీలోని రేట్లనే కొనసాగించారు. మున్సిపల్ యాక్టు ప్రకారం మూడేళ్ల తర్వాత మున్సిపాలిటీలకు అనుగుణంగా రేట్లు పెంచాల్సి రావడంతో రెట్టింపయ్యాయి. ఈ పన్నులు ఏమిటని గత ఏడాది చాలామంది కట్టకపోవడంతో బకాయిలు రూ.3కోట్ల మేర పేరుకుపోయాయి. అప్పటి మున్సిపల్ కమిషనర్, పాలకవర్గం సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. పన్నురేట్లను పాక్షికంగా తగ్గించనున్నట్లు గెజిట్ విడుదల చేశారు. తాజాగా మున్సిపల్ ఉన్నతాఽధికారులు ఆమోదం తెలపడం, కొంత మంది బకాయిలు కట్టడంతో అధికారులకు ఊరటనిచ్చింది.
58.2 శాతమే వసూళ్లు
మున్సిపాలిటీలో 2024–2025 వార్షిక పన్ను లక్ష్యం రూ.5.80 కోట్లుగా అధికారులు పెట్టుకున్నారు. ఇప్పటికి రూ.3.37 కోట్లు (58.2 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.2.43 కోట్లు పెండింగ్ ఉంది. అధికారులు వసూళ్లలో వేగం పెంచినప్పటికీ ప్రజలకు నుంచి ఆశించిన మేర స్పందన రావడం లేదు.
పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం
మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలను సాధ్యమైనంత వరకు వసూలు చేశాం. ఈ ఏడాది ఇంకా కొన్ని వసూలు కావాల్సి ఉంది. నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం.
– యోగేశ్, మున్సిపల్ కమిషనర్, శంకర్‌పల్లి
బస్తీల్లో అధికారుల ముమ్మర ప్రచారం


