షాద్‌నగర్‌రూరల్: జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం కోనాయపల్లి గ్రామ పంచాయతీ పరిధి లచ్యానాయక్‌తండాకు చెందిన సామ్యనాయక్(50)కు జ్వరం వచ్చిందని కుటుంబ సభ్యులు ఈ నెల 14న పట్టణంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకువచ్చారు. అతన్ని పరీక్షించిన ఆర్‌ఎంపీ.. తాను నిర్వహిస్తున్న బాలాజీ ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అనంతరం అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. సామ్యనాయక్‌కు డెంగీ ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్న వ్యక్తికి.. ప్లేట్‌లెట్స్ క్రమంగా తగ్గుతుండటంతో.. మెరుగైన వైద్యంకోసం నగరానికి తీసుకెళ్తామని ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబీకులు చెప్పినా.. వినిపించుకోలేదు. ఇక్కడ మంచి వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. గమనించిన వైద్యులు సీపీఆర్ చేశారు. రోగి మృతి చెందాడని నిర్ధారించుకున్న వైద్యులు, యాజమాన్యం ఆస్పత్రి షట్టర్స్‌ను మూసి వేశారు. మృతుడి కుటుంబీకులు కిందకు వెళ్లి తిరిగి పైకి వచ్చే సరికి.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బంధువుల ఆందోళన
సామ్యనాయక్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆదివారం అర్ధరాత్రి బాలాజీ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బందోబస్తు నిర్వహించారు. సోమవారం ఉదయం మరోసారి ఆందోళన చేశారు. ‘మా నాన్న చావుకు ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే’ కారణమని మృతుడి కుమారుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్‌ఐ రాంచందర్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
కుటుంబీకులు,బంధువుల ఆరోపణ
ఆస్పత్రి ఎదుట ధర్నా
జ్వరమని వెళ్తే.. ప్రాణం తీశారు!