పారిశుద్ధ్య సిబ్బంది కొరత
ఆమనగల్లు: విఠాయిపల్లి గ్రామాన్ని కలిపి ప్రభుత్వం ఆమగల్లు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా అవసరమైన సిబ్బందిని మాత్రం నియమించలేదు. పట్టణంలో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. ప్రతిరోజూ ప్రధాన రహదారిని మాత్రం శుభ్రం చేస్తుండగా కాలనీల్లో మాత్రం రెండుమూడు రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. మున్సిపాలిటీలో 48 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. చెత్త సేకరణకు ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. నిత్యం 1.8 టన్నుల తడిచెత్త, 2.1 టన్నుల పొడిచెత్తను సేకరించి పట్టణ సమీపంలోని డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 17 కిలోమీటర్ల భూగర్భ మురుగు కాలువలు ఉన్నాయి. పలు కాలనీల్లో మురుగు కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. మరో రెండు కిలోమీటర్ల మురుగు కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.


