చేవెళ్ల: పెండింగ్ రేగడిఘనాపూర్–చనువెళ్లి లింక్‌రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి సూచించారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు రఘువీర్‌రెడ్డి కాలికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న చీఫ్ విప్.. ఆదివారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పట్నంను కలిసి, సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామం నుంచి చనువెళ్లి లింక్‌రోడ్డుకు మంత్రిగా ఉన్న సమయంలో రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారని, ఆ పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు. వెంటనే ఆయన పంచాయతీ రాజ్ ఎస్‌ఈకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ రోడ్డుపై ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిధులు రిజెక్ట్ అయ్యాయని, మరోసారి ప్రతిపాధనలు పంపాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మాట్లాడి మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించి ఈ ప్రాంతంలో ఇలా మిగిలిపోయిన బ్రిడ్జిలకు సంబంధించి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, చంద్రయ్య తదితరులు ఉన్నారు.
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి


