పహాడీషరీఫ్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బాలాపూర్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో శుక్రవారం లభ్యమయింది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామ పరిధి వీఐపీ కాలనీ బహిరంగ ప్రదేశంలో ఓ వ్యక్తి పడున్నాడన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. కానీ అతను అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 52–55 ఏళ్ల మధ్య ఉంటుందని, సంబంధికులెవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్ లేదా.. 87126 62366 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
చెరువులో పడి మేసీ్త్ర మృతి
కొడంగల్ రూరల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం రుద్రారం పరిధిలోని పాటిమీదిపల్లి భీరం చెరువులో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బషీరాబాద్ మండలం బాదులాపూర్‌తండాకు చెందిన రాథోడ్ మోహన్(46) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగి బీరం చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత సరిగ్గా రాకపోవడంతో చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి భార్య సాలీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు.
వరకట్న వేధింపులకు యువతి బలి
అత్తాపూర్: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్‌కు చెందిన స్వప్న(27)కు అత్తాపూర్ పాండురంగ నగర్‌కు చెందిన అమరేష్‌కు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కొద్దిరోజులుగా అమరేష్ అదనంగా కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. పెళ్లి సమయంలో పెట్టిన బంగారాన్ని తన అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టడంతో పాటు అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ వేధించసాగాడు. ప్రతిసారి ఇంటి నుంచి డబ్బులు తేలేక..వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీ, వ్యక్తి మృతి
పరిగి: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి రంగంపల్లి కాటన్‌మిల్లు సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి నుంచి రంగంపల్లి వైపు హైదారాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి, గురువారం రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలై దుర్మరణం చెందాడు.


