ఔటర్‌పై ఘోర ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై ఘోర ప్రమాదం

Mar 7 2025 9:24 AM | Updated on Mar 7 2025 9:20 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. రావిర్యాల వండర్‌లా సమీపంలోని ఎగ్జిట్‌ నంబరు 13 దాటిన అనంతరం 200 మీటర్ల దూరంలో డివైడర్‌పై ఉన్న మొక్కలకు హెచ్‌ఏండీఏ ట్యాంకర్‌ ద్వారా కొంగరకలాన్‌కు చెందిన చెనమోని రాములు (55) నీళ్లు పోస్తున్నాడు. ఉప్పల్‌లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ ఎక్కిన నాగర్‌కర్నూల్‌ జిల్లా, చిన్నాంబాయి మండలం బెక్కం గ్రామానికి చెందిన కోషిక రవీందర్‌రెడ్డి, బత్తిని కృష్ణారెడ్డి (టీఎస్‌07జెఎం 1210) కారులో అతివేగంగా వెనుక నుంచి వచ్చి ట్యాంకర్‌తో నీరు పోస్తున్న రాములును ఢీకొట్టారు. దీంతో అతడు గాల్లో ఎగిరి డివైడర్‌పై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కారు.. ట్యాంకర్‌ వెనుకభాగం కిందికి దూసుకెళ్లింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న కోషిక రవీందర్‌రెడ్డి (50) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారు నడుపుతున్న బత్తిని కృష్ణారెడ్డి (45) పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120– 140 స్పీడ్‌లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ట్యాంకర్‌ కిందికి దూసుకెళ్లడంతో రవీందర్‌రెడ్డి మృతదేహంతో పాటు కృష్ణారెడ్డిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సీఐ రాఘవేందర్‌రెడ్డితో పాటు ఎస్‌ఐ వెంకటేశ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగంగా వచ్చి ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు

అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం

మరొకరి పరిస్థితి విషమం

ఇద్దరు స్నేహితులు

రోడ్డు ప్రమాదానికి గురైన కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. కృష్ణారెడ్డి కొండాపూర్‌లో ఉంటూ స్వీట్‌ షాప్‌ నిర్వహిస్తుండగా, రవీందర్‌రెడ్డి బోరబండలో ఉండేవాడు. వీరి మృతితో బెక్కంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కూలి కోసం వెళితే..

ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌కు చెందిన రాములు ఓ కాంట్రాక్టర్‌ వద్ద కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జగదీష్‌ డిమాండ్‌ చేశారు .

ఔటర్‌పై ఘోర ప్రమాదం 1
1/2

ఔటర్‌పై ఘోర ప్రమాదం

ఔటర్‌పై ఘోర ప్రమాదం 2
2/2

ఔటర్‌పై ఘోర ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement