ఢిల్లీలో గిరిజన విద్యార్థులతో రాష్ట్రపతి ప్రత్యేక సమావేశం
వ్యవసాయ కూలీల కుమారుడి ప్రతిభకు గుర్తింపు
వీర్నపల్లి: నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు తన ప్రతిభతో దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం దక్కించుకున్నాడు. కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల పూర్వ విద్యార్థి, వీర్నపల్లి మండలానికి చెందిన నునావత్ వరుణ్‌కు ఈ అవకాశం లభించింది. జన్జాతీయ గౌరవ్ పఖ్వాడాలో భాగంగా గురువారం ఈ సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా 149 మంది
దేశవ్యాప్తంగా 149 మంది విద్యార్థులు, తెలంగాణ నుంచి 13 మందికి అవకాశం దక్కగా.. జిల్లాకు చెందిన వరుణ్ ఉన్నారు. ఈకార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు చెందిన 149 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో 10, 12వ తరగతి టాపర్లతోపాటు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎన్‌ఎల్యూ, ఎన్‌ఐఎఫ్టీ, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందిన వారు ఉన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఈ పఖ్వాడా నిర్వహిస్తున్నారు.
బాబాయి చెరువు తండా నుంచి..
వీర్నపల్లి మండలం బాబాయిచెరువు తండాకు చెందిన వ్యవసాయ కూలీలు నునావత్ తిరుమల, జవహర్‌లాల్ దంపతుల కొడుకు వరుణ్. కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య పాఠశాలలో చదువుకున్నాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్న లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ప్రవేశం పొందిన వరుణ్.. తాజాగా రాష్ట్రపతిని కలిసే అవకాశం దక్కించుకోవడం విశేషం. వరుణ్ విజయం గిరిజన విద్యార్థులతో పాటు గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.


