బతికొస్తుందనుకున్న బిడ్డ..
● తప్పిపోయిందనుకున్న మూడేళ్ల అమ్ములు మృత్యువాత ● వ్యవసాయ బావిలో చిన్నారి మృతదేహం లభ్యం ● కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
ముస్తాబాద్: అల్లారుముద్దుగా పెంచుకున్న మూడేళ్ల చిన్నారి విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదించారు. కనిపించకుండా పోయిన తమ బిడ్డ ఎక్కడో క్షేమంగా ఉంటుందని ఆశగా ఎదురుచూసిన వారికి చివరకు తీరని విషాదమే మిగిలింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ముస్తాబాద్ ఎస్సై జ్యోతి కథనం ప్రకారం.. కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ముచ్చర్ల ఎల్లయ్య, మౌనిక దంపతులకు అమ్ములు (3), అర్జున్ (1) సంతానం. చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ దంపతులు ఆరు నెలలుగా ముస్తాబాద్ గ్రామ శివారులోని ఓ గుడిసెలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో గురువారం పనుల నిమిత్తం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా, గుడిసె వద్ద ఆడుకుంటున్న అమ్ములు సమీపంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సైతం చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం గుడిసె సమీపంలోని వ్యవసాయ బావిలో అమ్ములు మృతదేహం తేలి కనిపించింది. బతికే ఉంటుందన్న ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు చిన్నారి మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. అక్కడున్న సంచార కుటుంబాలవారు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జ్యోతి తెలిపారు. పేద కుటుంబానికి చెందిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.


