ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయ ప్రతిష్ఠతోపాటు సిద్ధోగం వేడుకలను పురస్కరించుకొని ఏఎంసీ వైస్ చైర్మన్ నంది కిషన్–ఉమ దంపతులు రూ.51వేల విరాళం గురువారం అందించారు. ఎల్లమ్మ గడపావనం ఇంటికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
కాలేజీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
కరీంనగర్‌క్రైం: కాలేజీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. త్రీ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన రంగుల వినయ్ (21) గురువారం సాయంత్రం సుభాష్‌నగర్ రోడ్ నంబర్ 1 మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన ఓ కాలేజీ బస్సు డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో వినయ్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. వినయ్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ త్రీ టౌన్ సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇద్దరు సబ్ ట్రెజరీ ఉద్యోగులపై బదిలీ వేటు
న్యూశాయంపేట: నర్సంపేట డివిజనల్ సబ్ ట్రెజరీలో లంచం డిమాండ్, ఉద్యోగుల వేధింపులపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా నర్సంపేట డివిజనల్ సబ్ ట్రెజరీ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏటీఓ) బి.చంద్రకళను కరీంనగర్‌కు, సీనియర్ అకౌంటెంట్ అలేఖ్యను భద్రాద్రి కొత్తగూడం జిల్లాకు బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆప్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కె.పార్వతీదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు సబ్ ట్రెజరీ ఆఫీసర్ మహ్మద్ రఫీని నర్సంపేట ఏటీవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో టీఎస్‌జీఎల్‌ఐ ఆఫీస్
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా(టీఎస్‌జీఎల్‌ఐ) జిల్లా ఆఫీస్‌ను కరీంనగర్ కలెక్టరేట్‌లోని 201 గదికి మార్చినట్లు ఆఫీస్ వర్గాలు గురువారం తెలిపాయి. టీఎస్‌జీఎల్‌ఐకి సంబంధించిన డెత్ క్లెయిమ్స్, మెచ్యూరిటీ క్లెయిమ్స్, పాలసీలు, పాలసీల వివరాలు, లోన్స్, ఇతర సేవల కోసం వచ్చే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉద్యోగులు, పాలసీదారులు నేరుగా కరీంనగర్ కలెక్టరేట్ భవనంలోని 201కి రావాలని కోరారు.
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
సిరిసిల్ల అర్బన్: బతుకుదెరువు కోసం పది నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లిన సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేట జ్యోతినగర్‌కు చెందిన అల్లెపు మల్లయ్య(55) మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. పని చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఆయన అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందాడు. కూతుళ్ల వివాహాల కోసం రూ.17లక్షల వరకు లోన్ తీసుకున్నాడని తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుని భార్య దేవవ్వ, కుటుంబ సభ్యులు కోరారు. మృతునికి భార్య దేవవ్వ, కూతుళ్లు రజిత, సుమలత, కుమారుడు వినోద్ ఉన్నారు.


