నేడు వినాయక నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

నేడు వినాయక నిమజ్జనం

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

మానేరులో సకల సదుపాయాలు రూ.19 లక్షలతో వసతులు వాగులో రెండు కొలనులు తవ్వించిన మున్సిపల్‌ అప్రోచ్‌ రోడ్డు, లైటింగ్‌ ఏర్పాట్లు పూర్తి రూట్‌మ్యాప్‌ పరిశీలించిన ప్రభుత్వ విప్‌, కలెక్టర్‌, ఎస్పీ

సిరిసిల్లటౌన్‌: వినాయక నిమజ్జన ఉత్సవాలకు సిరిసిల్ల మానేరువాగు ముస్తాబైంది. పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడిని మానేరు వాగులో నిమజ్జనం చేయడం అనాదిగా వస్తోంది. పది రోజులపాటు మున్సిపల్‌, సెస్‌, పోలీస్‌శాఖలు నిమజ్జన వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించాయి.

మానేరులో ప్రత్యేక కొలనులు

పట్టణ శివారులోని మానేరునదిలో శుక్రవారం వినాయక నిమజ్జనానికి మున్సిపల్‌ అధికారులు రూ.19లక్షలతో చర్యలు చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా నేతృత్వంలో అధికారులు మానేరువాగులో ప్రత్యేకంగా రెండు కొలనులు తవ్వించారు. 30 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో పెద్ద కొలను. కొంత చిన్నసైజులో మరో కొలను తవ్వించారు. అత్యధిక వోల్టేజీ గల జనరేటర్ల సాయంతో వందల సంఖ్యలో లైటింగ్‌, అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేశారు. వినాయకుల నిమజ్జనానికి ఏడు భారీ క్రేన్లు ఏర్పాటు చేయగా.. ఐదు మానేరు వాగులో, మరో రెండు వినాయక మండపాల నుంచి విగ్రహాలను ఎత్తడానికి వినియోగించనున్నారు. నిమజ్జన స్థలంలో 36 మంది గజ ఈతగాళ్లతోపాటు 70 మంది శానిటేషన్‌ కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు.

రోడ్డు మ్యాపు సిద్ధం

పట్టణంలో జరిగే వినాయక నిమజ్జన వేడుకలపై రోడ్డు మ్యాపును ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశాలతో ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆధ్వర్యంలో డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ పూర్తి చేశారు. టౌన్‌ సీఐ రోడ్డుమ్యాపుపై లోతుగా పరిశీలన జరిపి నిమజ్జనం రోజున అమలు చేయాల్సిన నిబంధనలపై ఆదేశాలిచ్చారు.

ఎనిమిది చోట్ల నిమజ్జనం

సిరిసిల్లలో శుక్రవారం జరిగే నిమజ్జన వేడుకలకు మానేరువాగులో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మానేరుతీరం, చంద్రంపేట, రగుడు, రాజీవ్‌నగర్‌, పెద్దబోనాల, చిన్నబోనాల, పెద్దూరు, సర్దాపూర్‌లలో సమీప చెరువుల్లో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తరలివచ్చే వినాయకులకు స్వాగతం పలికేందుకు సిరిసిల్ల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement