సిరిసిల్ల అర్బన్: ధన్వంతర జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఎంవోలు సుమన్‌మోహన్, ప్రవీణ్, కపిల్, కాశీనాథం, ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, రామ్మూర్తి, నవీన్‌కుమార్, కన్వీనర్ స్వాతి, నస్రిన్, డీపీఎం తిరుపతి పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
గంభీరావుపేట(సిరిసిల్ల): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని గోరింటాలకు ఎమ్మెల్యే కేటీఆర్ సీసీ కెమెరాలను అందించగా బుధవారం ప్రారంభించారు. సర్పంచ్ ఎర్రం లతిక, మాజీ ఎంపీటీసీలు అంజిరెడ్డి, కొమిరిశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రైబల్ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పాట్ అడ్మిషన్స్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జయ తెలిపారు. ఎంపీసీఎస్, బీజెడ్సీ, ఎంజెడ్సీ, బీఏ, బీకాం కోర్సులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈ నెల 24, 25 తేదీలలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
మట్టి తరలింపుపై విచారణ
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లిలో గుట్టల మట్టిని అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి తరలించిన ఘటనపై జిల్లా మైనింగ్, మండల రెవెన్యూ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. నిమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొని ఉన్న గుట్ట నుంచి కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాజకీయ పలుకుబడితో సెలవు రోజులు, రాత్రి వేళల్లో జేసీబీలతో అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి తవ్వడంతో గుట్టకు ఉన్న బండరాళ్లు కిందికి జారి స్కూల్ భవనాలపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో 1–10 తరగతుల వరకు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. విచారణలో జిల్లా మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, కోనరావుపేట డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఐ సంతోష్ పాల్గొన్నారు.
చిరు జల్లులు
సిరిసిల్ల: జిల్లాలో బుధవారం చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా ఎల్లారెడ్డిపేట మండలంలో 12.7 మిల్లీమీటర్లు, బోయినపల్లిలో 2.8, సిరిసిల్లలో 0.8, కోనరావుపేటలో 2.2, వీర్నపల్లిలో 1.2, ముస్తాబాద్‌లో 1.1, ఇల్లంతకుంటలో 1.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
13 ఏళ్లుగా.. మట్టి వినాయకుడు
గంభీరావుపేట: మండలంలోని లింగన్నపేటకు చెందిన దిల్ యూత్ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా 13 ఏళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.


