30న సిరిసిల్లలో లక్ష మందితో సీఎం సభ
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఈనెల 30 నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి సభ ప్రజం‘జనం’ కావాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని కే–కన్వెన్షన్‌లో సీఎం సభ నిర్వహణపై కాంగ్రెస్ పా ర్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలనకు వెయ్యి రోజు లు పూర్తి అయ్యాయని, మరో పది వేల రోజులకు స్ఫూర్తినిచ్చేలా సభను ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విజయవంతం చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వస్తానని ప్రకటించడంతో గులాబీ గుండెల్లో గుబులు, భారాసలో భయం పుట్టిందన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ ఒక్కపైసా ఇవ్వలేదని, సీఎం రేవంత్‌రెడ్డి రూ.250 కోట్లు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చి రూ.300 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టా రని వివరించారు. ముందుగా కేసీఆర్, కేటీఆర్‌లు కవిత, రమ్యారావుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, ఎలయ్య, పార్టీ నాయకులు ఆడెపు చంద్రకళ, దేవరాజు, చక్రధర్‌రెడ్డి, కాముని వనిత, చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సురేందర్‌రెడ్డి, నాగం కుమార్, గొట్టె రుక్మిణి, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల చైర్మన్లు, ఆ త్మ కమిటీ ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువజన విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం సభా స్థలం పరిశీలన
జిల్లా కేంద్రంలో ఈనెల 30న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభా స్థలాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గితేతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, ఇతర మౌలిక వసతులపై చర్చించారు. సాయంత్రం 4గంటలకు సీఎం సిరిసిల్ల చేరుకొని లక్ష మంది పాల్గొనే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
వేములవాడలో ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు జరుగుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. 33 జిల్లాలకు చెందిన 1300 మంది క్రీడాకారులు హాజరవుతారన్నారు. కబడ్డీ పోటీల్లో జూనియర్ (అండర్–20) బాలురు, సబ్ జూనియర్ బాలికల(అండర్–16) జట్లు పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్రస్థాయి కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.


