● 30 లక్షలతో సర్వాంగ సుందరంగా రాజన్న గుడి చెరువు ప్రాంతం ● బాహుబలితో పాటు 3 భారీ క్రేన్లు
వేములవాడ: ఎములాడ రాజన్న ఆలయ సమీపంలోని గుడి చెరువులో బుధవారం జరుగనున్న గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు అసౌకర్యం కలగకుండా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు రూ.30 లక్షల వ్యయంతో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గుడి చెరు వు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, పాలకవర్గ సభ్యులు, కమిషనర్ లోకేశ్, బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణలు మంగళవారం రాత్రి పరిశీలించారు.
60 ఫీట్ల వాటర్ ఫౌంటేన్
నిమజ్జనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా గుడి చెరువులో నూతనంగా వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. 60 అడుగుల ఎత్తు వరకు నీటి చినుకులను చిమ్ముతూ భక్తులకు కంటికి ఇంపుగా విజువల్ వండర్‌గా నిలవనుంది.
బాహుబలి ప్లస్ భారీ క్రేన్లు.. లైటింగ్
విగ్రహాల నిమజ్జనం వేగవంతంగా, సురక్షితంగా జరిపేందుకు భారీ క్రేన్లను సిద్ధం చేశారు. రాత్రి వేళల్లో నిమజ్జనం సజావుగా సాగేందుకు చెరువు గట్టు వెంట హైమాస్ట్ లైట్లు, ఫ్లడ్ లైట్లను అమర్చారు.
వినోద కార్యక్రమాలు
నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా స్టేజ్, కల్చరల్ ఈవెంట్స్ వేదికను కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేలతోపాటు వీఐపీలు హాజరుకానున్నారు.


