ఏళ్లుగా నివసిస్తున్నా ‘ఓటు’ గల్లంతు
బీఎల్‌వోలకే తప్పని నోటీస్‌లు
ఆధారాలు చేతబట్టుకుని ఆఫీసుల చుట్టూ బేజారు
వేములవాడ: సర్ నోటీస్‌లతో ఓటుహక్కును కాపాడుకునేందుకు ప్రజల ఆధారాలతో ఆఫీస్‌లు చుట్టూ తిరుగుతున్నారు. ఎస్‌ఐఆర్(సర్) సవరణకు వస్తున్న నోటీస్‌లు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఒకే ప్రాంతంలో నివాసముంటున్న వారి పేర్లు కూడా ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం, సవరణ నోటీసులు చేతికి రావడంతో జనం బేజారవుతున్నారు.
బీఎల్వో కుటుంబానికీ తప్పని తిప్పలు
క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న బీఎల్వో జ్యోతి కుటుంబానికి కూడా నోటీస్‌లు అందాయి. ఆమె తల్లి రాజమణి, కుమారుడు శివమణి, కూతురు హిమబిందు పేర్లు గల్లంతయ్యాయి. ఈమేరకు నోటీస్‌లు అందాయి.
ఆధారాలతో రాకపోతే ఓటు రద్దు బెదిరింపులు!
నోటీసులు అందుకున్న వారు నిర్ణీత తేదీ, సమయానికి సంబంధిత కార్యాలయానికి తగిన ఆధారాలతో హాజరుకావాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వయోవృద్ధులు, మహిళలు తమ పనులు వదులుకుని, కాగితాలు చేతపట్టుకుని ఆఫీసుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సాంకేతిక లోపాలు, సిబ్బంది అలసత్వంతో పొరపాట్లు జరుగుతున్నాయని, విచారణ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారానే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
1956 నుంచి ఉంటున్నా
వేములవాడలో 1956 నుంచి ఉంటున్నాను. నా పేరు కూడా సవరణ జాబితాలో గల్లంతైంది. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ.. ప్రతీ ఎన్నికలోనూ ఓటుహక్కు వినియోగించుకుంటున్న. అయినా నోటీస్‌లు అందాయి.
– కె.సాంబశివరావు, రిటైర్డ్ టీచర్


