ముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధ్యాయుల పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ముస్తాబాద్, చీకోడు, గూడెం గ్రామాల్లో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదును సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. 51 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీ అమలు చేయాలని, మోడల్‌స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే టీజీఈ జేఏసీ మహాధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మండలశాఖ అధ్యక్షుడు బాలకిషన్, ప్రధాన కార్యదర్శి శివశంకర్, సత్తయ్య, స్వామి, శంకర్, శివప్రసాద్ పాల్గొన్నారు.
కొంత మంది సర్పంచులపై చిన్నచూపు
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలంలోని కొంతమంది సర్పంచ్‌లపై అధికారులు, కాంగ్రెస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారంటూ పలువురు సర్పంచులు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల విషయం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీ జెండాపై గెలువకుండా ప్రజల అభిమానాలతో గెలిచిన సర్పంచ్‌లను అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. సర్పంచులు జంకె మధు, సాండెసారి సౌజన్య, జుట్టు నరేశ్, సయ్యద్ షాదుల్లా, కడారి సంధ్య, ఇల్లందుల లాస్య ఉన్నారు.
వైన్‌షాపుల్లో ఎనర్జీ డ్రింక్స్ విక్రయాలపై ఫిర్యాదు
వేములవాడరూరల్: మద్యం బాటిళ్లు విక్రయించాల్సిన బ్రాందీ షాపు నిర్వాహకులు ఎనర్జీ డ్రింక్ అమ్మడంతో చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని వేములవాడకు చెందిన బూర్ల ప్రదీప్ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కొందరు వైన్‌షాపు నిర్వాహకులు వాటర్‌బాటిల్స్, కూల్‌డ్రింక్స్ ఇతర తినుబండారాలు కూడా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
మానసిక ఆందోళన... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
జ్యోతినగర్: చదువుపై ఆందోళనతో ఇంటర్ విద్యార్థి అయాన్ ఖాన్(17) మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న అంజత్‌ఖాన్ కుటుంబం ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అయాన్‌ఖాన్ మానసిక వ్యథతో ఉరేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి పైకప్పుకు వేలాడుతూ కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చదువుపై ధ్యాస కుదరడం లేదనే ఆందోళనతో విద్యార్థి మానసికంగా ఇబ్బందికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజద్‌ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
బైక్ దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేసిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కమలాకర్ తన ద్విచక్ర వాహనాన్ని గతనెల 17న ఇంటి ముందు పార్క్ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై కుమారస్వామి కేసు దర్యాప్తు చేపడుతుండగా.. సోమవారం మధ్యాహ్నం విద్యానగర్ బైపాస్‌రోడ్ నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని రాయికల్ మండలం వీరాపూర్‌కు చెందిన షేక్ జమీల్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


