యూరియా పక్కదారి ! | - | Sakshi
Sakshi News home page

యూరియా పక్కదారి !

Aug 27 2026 12:06 AM | Updated on Aug 27 2026 12:06 AM

శుభోదయ గ్రామైక్య సంఘం ఎరువుల దుకాణ నిర్వాహకుల నిర్వాకం యాప్‌లో బుక్‌ చేసుకున్న రైతులకు మొండిచేయి అడ్డదారుల్లో 90 బస్తాల విక్రయం యూరియా అందక అన్నదాతల తిప్పలు బుక్కయ్యామంటున్న రైతులు

చందుర్తి(వేములవాడ): యూరియా బస్తాలు పక్కదారి పడుతున్నాయి. యాప్‌లో బుక్‌చేసుకున్న రైతులకు అందాల్సిన ఎరువుల బస్తాలు ఇతరులకు వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువల పంపిణీలో పారదర్శకత కోసం యాప్‌ తెచ్చినప్పటికీ వ్యాపారులు అయినవారికి బస్తాలు అందిస్తు న్నారు. చందుర్తి మండలం నర్సింగపూర్‌లోని శుభోదయ గ్రామైక్య సంఘం ఎరువుల దుకాణం నుంచి 90 యూరియా బస్తాలు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఎరువుల దుకాణానికి ఈనెల 16న 450 బస్తాలు సరఫరా చేశారు. అయితే దుకాణానికి వచ్చిన యూరియా నిల్వలు, విక్రయ వివరాలు, రైతులకు పంపిణీ చేసిన బస్తాల సంఖ్యపై విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి

యూరియా కోసం రైతులు దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్న సమయంలో బస్తాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణంలో ఇలా ఉంటే ఎరువుల డీలర్ల మాయాజాలం ఎలాగుందోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూ రియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఎరువులు దొరక డం లేదు. ఎరువుల దుకాణాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు.

నిల్వలు.. విక్రయాలపై స్పష్టత కరువు

దుకాణానికి వచ్చిన యూరియా బస్తాల్లో రైతులకు ఎంత మేరకు విక్రయించారన్న కోణంలో వ్యవసాయాధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. రికార్డుల్లోని వివరాలకు, పంపిణీకి మధ్య ఎంత తేడా ఉందో విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇతను చందుర్తి మండలం బండపల్లికి చెందిన రైతు లచ్చిరెడ్డి. వరికి రెండో దఫా యూరియా చల్లేందుకు వారం రోజులుగా యాప్‌లో బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఏ షాపుల్లోనూ నిల్వలు కనిపించలేదు. చివరికి నర్సింగపూర్‌లో శుభోదయ గ్రామైక్య సంఘంలో 90 బస్తాలు ఉన్నట్లు కనిపించడంతో వెంటనే 10 బస్తాలు బుక్‌ చేశాడు. షాప్‌ వద్దకు వెళ్లగా బస్తాలు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement