● వాగు పొంగితే రాకపోకలు బంద్ ● చదువుకు దూరమవుతున్న విద్యార్థులు ● వంతెనకు రూ.1.14కోట్లు మంజూరు ● మొదలుకాని పనులు ● ఏటా వర్షాకాలంలో ఇవే తిప్పలు
వీర్నపల్లి(సిరిసిల్ల): అడవిబిడ్డల విన్నపాలు అరణ్యరోదనగా మారుతున్నాయి. పాలకుల పట్టింపు లేనితనం.. అధికారుల నిర్లక్ష్యానికి వీర్నపల్లి మండలంలోని కాశీతండావాసుల కష్టాలు తీరడం లేదు. రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదు. గ్రామంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 21 కుటుంబాలు నివసించే కాశీతండావాసుల కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. కాశీతండ ప్రజల కష్టాలపై ఫోకస్.
20 కుటుంబాలు.. అష్టకష్టాలు
వీర్నపల్లి మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కాశీతండ ఉంటుంది. మద్దిమల్లతండా పంచాయతీ నుంచి కాశీతండాకు వెళ్లే మార్గంలో పెద్దవాగు ప్రవహిస్తుంటుంది. ఈ తండాకు ఎగువ ప్రాంతంలో ఉన్న రాయినిచెరువు నిండి మత్తడి దుంకితే ఈ పెద్దవాగు పొంగి ప్రవహిస్తుంటుంది. దీంతో కాశీతండలో నివసించే దాదాపు 20 గిరిజన కుటుంబాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ తండాను ఆనుకుని ఉన్న వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వరద వచ్చి రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారుతుంది. ఇక తండాకు చెందిన 18 మంది విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వాగు ప్రవాహించినంత కాలం బడికి సెలవు పెట్టాల్సిందే. అత్యవసర వైద్యసేవలకు దూరమవుతున్నారు.
నిధులున్నా కదలని పనులు
కాశీతండ వాసుల వాగుకష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.14కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు మాత్రం ఏళ్లుగా మొదలుకాలేదు. తండాలో 100 మీటర్ల మేర చేపట్టాల్సిన సీసీ రోడ్డు పని సైతం అర్ధంతరంగా నిలిచిపోయింది. దీంతో బురదరోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నారు.


