సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం.. సాహితీవేత్తల ఖిల్లా అని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివనగర్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పద్యకవి, యోగాచార్యులు జక్కని వెంకటరాజం రచించిన చిత్స్వరూప శతకం, చెన్నపార్యశతకం పుస్తకాలను ఆవిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగుశాఖ పూర్వ అధ్యక్షుడు, కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, మసన చెన్నప్ప పాల్గొని మాట్లాడారు. వెంకట్రాజం శతకాలు సరళంగా, సులభతరంగా రచించారని కొనియాడారు. జల్ద విశ్వనాథ కుమార్ మాట్లాడుతూ.. పద్మశాలీలు సాహితీరంగంలో రాణిస్తున్న వారి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. నిత్య యోగ సాధన సేవా సమితి గురువులు ఉప్పల శ్రీనివాస్, బిళ్ల శ్రీకాంత్, యాద రమేశ్, గంగాధర్, కొత్తచెరువు యోగ నిర్వాహకులు ప్రతాప్, దూడం మనోహర్, శివాలయం అధ్యక్షుడు సిరిపురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్సంగ సదనంకు
‘శ్రీరామ హృదయ’ కలశం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సత్సంగ సదనానికి ‘శ్రీరామ హృదయం’ కలశం ఆదివారం నగర సంకీర్తనతో చేరింది. ఏకాదశి సందర్భంగా గోవిందరాజుల చారిటబుల్ ట్రస్ట్ సత్సంగ సదనం అధ్యక్షుడు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ప్రవచనాలు వినిపించారు. అంతకుముందు ఉదయం మండల కేంద్రంలో భక్తులు భక్తిపాటలు పాడుతూ నగర సంకీర్తన చేశారు.
వర్షాకాలంలో తాగునీటి సమస్యనా?
సిరిసిల్లటౌన్: వర్షాకాలంలో నల్లానీరు సరిగ్గా రావడం లేదని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ ప్రశ్నించారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో రెండు రోజులుగా నల్లా నీరు సరిగ్గా రావడం లేదన్నారు. ఆదివారం నీటి సరఫరాను నిలిపివేశారన్నారు. నీటి సరఫరాలో అంతరాయంపై ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
యూత్ కాంగ్రెస్ ఉత్సవాలు
వేములవాడ: జాతీయ యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం నిర్వహించారు. మల్లారంరోడ్డు నంది జంక్షన్ వద్ద నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఎండీకి కొనసాగుతున్న నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం ఎల్‌ఎండీకి 5వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా 12,600, మానేరు, మూలవాగుల నుంచి 2,811 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 21.334 టీఎంసీలకు చేరింది.


