భూ వివాదాలతో రావొద్దు..! | - | Sakshi
Sakshi News home page

భూ వివాదాలతో రావొద్దు..!

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌.. పోలీసు విభాగానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భూ సమస్యలకు సంబంధించిన ఎలాంటి వివాదాలూ తమ వద్దకు తీసుకురావద్దని జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎదుట పోలీసులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు గమనించకుండా వెళ్లిన వారికి ప్రజావాణి లేదా రెవెన్యూ విభాగానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితులు ప్రజావాణి బాట పడుతున్నారు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, ఆస్తి పంపకాలు, అద్దె గొడవలు, సివిల్‌ వివాదాల విషయాల్లో పోలీసులు కలగజేసుకోరు. కానీ.. ఈ వివాదాల నేపథ్యంలో ఏవైనా గొడవలు, కొట్లాటలు, ఇతర హింసాత్మక చర్యలు తలెత్తితే మాత్రం వారి జోక్యం అనివార్యం. ఇటీవల పెద్దపల్లి డీసీపీ కూడా ఎలాంటి భూవివాదాల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఠాణాల ఎదుట ఈ బోర్డులు వెలిశాయి.

నాటి వివాదమే కారణమా..?

ఇటీవల రెవెన్యూ, పోలీసు శాఖలతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు పోలీసులు దారి తప్పుతున్నారని, ఎవరు ఏమేం చేస్తున్నారో తనకు అంతా తెలుసని, ప్రతీ ఒక్క పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్‌ పోలీస్‌ శాఖకు నేరుగా హెచ్చరికలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్‌ హెచ్చరికలను డిపార్ట్‌మెంట్‌లోని కొందరు స్వాగతించగా.. మరికొందరు విభేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెజారిటీ పోలీసులు కలెక్టర్‌ తీరుపై అసంతప్తిగానే ఉన్నా.. బయటకు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖలో రెవెన్యూ విభాగానికి చెందిన భూ సమస్యల ఫిర్యాదులు తీసుకోకూడదంటూ పెద్దపల్లి డీసీపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామే తప్ప.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బోర్డులు ఏర్పాటు చేయలేదని పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు.

పోలీసు శిక్షణకు పరస్పర దూరం

రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య దూరం లేదని పైకి చెబుతున్నా.. వారి చర్యలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పోలీసు ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు కనిపించలేదు. అదే పెద్దపల్లిలో జరిగిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి పోలీసు విభాగం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఈ రెండు కార్యక్రమాల్లో సంబంధిత విభాగాలు పాల్గొనలేకపోవడానికి కారణం సమాచార లోపమా..? లేక రెండు విభాగాల మధ్య పెరుగుతున్న దూరమా..? అనే విషయంపై ఎవరూ స్పష్టతఇవ్వడం లేదు. మొత్తానికి రెండు విభాగాల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో మాత్రం చర్చ మొదలైంది.

పోలీస్‌స్టేషన్ల ఎదుట బోర్డులు పెట్టిన జిల్లా పోలీస్‌ యంత్రాంగం

అలాంటి సమస్యలుంటే రెవెన్యూ విభాగానికి వెళ్లాలని సలహా

ఇటీవల కలెక్టర్‌ ‘క్లాస్‌’తోనే ఫ్లెక్సీలు వెలిశాయన్న చర్చ

అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్న పోలీసులు

పోలీసు అభ్యర్థుల శిక్షణ కార్యక్రమాల్లో పరస్పర దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement