లక్ష ఎకరాల్లో వరి నాట్లు 47,120 ఎకరాల్లో పత్తి సాగు చిరుజల్లులతో అన్నదాతల ఆశలు వేములవాడ రూరల్‌లో అత్యధికంగా 33.6 మిల్లీ మీటర్ల వర్షం
సిరిసిల్ల: జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పత్తి పంటకు అనుకూలమైన వర్షాలు పడుతుండగా.. వరికి మాత్రం ప్రతికూలంగా ఉంది. జిల్లాలో కురుస్తున్న చిరు జల్లులతో అన్నదాతలు ఖరీఫ్ సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటికే వరినారు ఎదగడంతో నీటి కోసం నిరీక్షించిన రైతులు చిన్న పాటి వర్షం జల్లులు పడడంతో ఆశతో నాట్లు వేస్తున్నారు. బోర్లలో నీరున్న రైతులు ఇప్పటికే వరినాట్లు వేయగా, తుకం పోసి పడిగాపులు కాస్తున్న రైతులు కొద్ది పాటి వర్షాలు పడడంతో నాట్లు వేస్తున్నారు.
2.48 లక్షల ఎకరాల్లో..
జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో వానాకాలంలో పంట లు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వరి 1,91,366 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. కానీ కాలం లేక, వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటి వరకు సుమారు లక్ష ఎకరాల్లో వరి వేశారు. 47,120 ఎకరాల్లో పత్తి, 3,430 ఎకరాల్లో మొక్కజొన్న వేయగా, ఇతర అన్ని పంటలు కలిపి 5,593 ఎకరాల్లో వేశారు. జిల్లాలో 665 చెరువులు ఉండగా, ఏ చెరువులోనూ వర్షం నీరు చేరలేదు. జిల్లాలోని జలాశయాలన్నీ నీరు లేక వెలవెలబోతుండడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించలేమని నీటిపారుదలశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోని మానేరువాగు, వేములవాడ మూ లవాగుల్లో నీరు లేక ఎడారిగా మారాయి. వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికార యంత్రాంగం ప్రచారం చేస్తుంది. కానీ, అలవాటుగా మారిన వరి సాగుపైనే అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. వారం రోజు లుగా చిరు జల్లులు కురుస్తుండడంతో వానాకాలంపై ఆశలతో వరి నాట్లు వేస్తున్నారు. పత్తి రైతులు మాత్రం అంతరకృషితో ముందుకు సాగుతున్నారు.
జిల్లా అంతటా వర్షాలు
జిల్లా వ్యాప్తంగా ఆదివారం వర్షం జల్లులు కురి శాయి. అత్యధికంగా వేములవాడ రూరల్‌లో 33.6 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 3.9, చందుర్తి 26.9, బోయినపల్లి 19.8, వేములవాడ 11.3, సిరిసిల్ల 2.5, కోనరావుపేట 11.3, వీర్నపల్లి 5.5, ఎల్లారెడ్డిపేట 5.3, గంభీరావుపేట 14.6, ముస్తాబాద్ 8.9, తంగళ్లపల్లి 3.1, ఇల్లంతకుంటలో 1.1 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 11.4 మి.మీ నమోదైంది. రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో 51 శాతం లోటు వర్షపాతం ఉంది.
పత్తికి అనుకూలంగా..
కొద్దిపాటి వర్షం రావడంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మరోవైపు పత్తి రైతులు కలుపు తీస్తూ డౌరాలు కొడుతూ ఎరువులు వేస్తున్నారు. జిల్లాలో పత్తికి అనుకూలంగా ఉండగా, పంటను రక్షించుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. నల్లరేగడి నేలల్లో పత్తి మొక్కలు ఏపుగా ఎదిగాయి. వరి సాగు చేయాలని ఆశిస్తున్న రైతులకు సాగునీటి లభ్యతపై అనుమానాలున్నాయి. మొక్కజొన్న, కందులు, పెసర, బబ్బెర వంటి పంటలు వేసుకో వాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. వరి వద్దంటూనే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఎకరం కూడా ఖాళీగా ఉంచవద్దని అధికారులు చెబుతున్నారు. నీరు లేకుంటే ఏ పంట అయినా దిగుబడి రాదని, వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ఈ వర్షాకా లం కలిసి రాకపోవడంతో భిన్నమైన పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు.


