సిరిసిల్ల: యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నారు. రాత్రి వేళల్లో కుక్కలు, టార్చిలైట్లు, వలలు, ఉరులు వెంట వేసుకుని అడవి జంతువులను మట్టుబెడుతున్నారు. వన్యప్రాణులు నీరు తాగే ప్రాంతాలు, ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను బంధిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి జంతువులను బంధించడం, చంపడం నేరం. కానీ వేటను వృత్తిగా స్వీకరించి కొందరు గుట్టుగా దందా సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అటవీశాఖ అధికారులు వేటగాళ్లను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా అడవిలో షికారి(వేట) ఆగడం లేదు.
వన్యప్రాణుల బలి
ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో దట్టమైన అడవులు ఉండగా, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వేములవాడ రూరల్, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో చిట్టడవులు ఉన్నాయి. జిల్లాలో 379.14 చదరపు కిలోమీటర్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లా అడవుల్లో కుందేళ్లు, దుప్పులు, జింకలు, మనువోతులు, ఉడుములు, కొండగొర్రెలు, అడవిపందులు, నక్కలు, తోడేళ్లు, అడవికోళ్లు, ఏదులు, నెమళ్లు ఉన్నాయి. వీటిని వధించడం నేరమైనా పట్టించుకోకుండా వేటగాళ్లు రహస్యంగా దందా సాగిస్తున్నారు. అటవీ గ్రామాలకు చెందిన వేటగాళ్లు స్థానిక పోలీసులను మచ్చిక చేసుకుని వన్యప్రాణుల మాంసాన్ని అందిస్తూ భయం లేకుండా వేట సాగిస్తున్నారు. అటవీశాఖకు సిబ్బంది తక్కువగా ఉండడంతో వేటగాళ్లని నిరోధించడం కష్టంగా మారింది. పోలీసుల భయం లేకపోవడంతో వన్యప్రాణుల వధ యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో ఐదు చిరుత పులులు ఉండగా.. వాటికి అడవుల్లో పూర్తి స్థాయి ఆహారం దొరక్క ఊరిలోకి వచ్చి పశువులపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో చిరుతకు వన్యప్రాణులు లభిస్తే అవి జనవాసాల్లోకి వచ్చే అవకాశం ఉండదు.
కేసులు నమోదు చేస్తాం
ఎవరైనా అడవిలోకి వెళ్లినా వన్యప్రాణులను వధించినా కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ఇల్లంతకుంటలో అడవిపంది మాంసాన్ని విక్రయించే వ్యక్తిపై కేసు నమోదు చేశాం. వాహనాన్ని సీజ్ చేశాం. వేటగాళ్లపై గతంలో కేసులు నమోదు చేశారు. వారిపై నిఘా ఉంచాం. ఇంకా ఎవరైనా ఆ వృత్తిని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల జోలికి వెళ్లవద్దు. వన్యప్రాణులను వధించడం తీవ్ర నేరంగా పరిగణిస్తాం.
– జి.నాగేశ్వర్‌రావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, సిరిసిల్ల


